విశాఖకు పండుగ

23 Jan, 2015 01:17 IST|Sakshi
విశాఖకు పండుగ

నేటినుంచి ఉత్సవ్
మూడు రోజుల పాటు నిర్వహణ
సర్వాంగ సుందరంగా విశాఖ
{పత్యేక కార్యక్రమాల కనువిందు

 
విశాఖ అర్బన్: విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుం దరంగా ముస్తాబైంది. సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుద్‌హుద్ తుపాను ఛాయలు కనిపించని విధంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయిలో వేదికలను ముస్తాబు చేస్తోంది. విశాఖ పర్యాటకాభివృద్ధికి, ప్రపంచ
 
దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు ఈ విశాఖ ఉత్సవ్‌ను వేదికగా చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. విశాఖ ఉత్సవ్ వేడుకలు జరిగే ప్రాంతాల రూపురేఖలు మార్చేశారు. ప్రతి వేదికను విభిన్నంగా, ప్రత్యేక సెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్‌కే బీచ్ వద్ద కైలాసగిరిని తలపించే సెట్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ వేదికపై ఒకేసారి వంద మంది కళాకారులు ప్రదర్శనల్చినా తట్టుకునే స్థాయిలో స్టేజ్‌ను నిర్మించారు. అక్కడే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రముఖమైన ఎనిమిది దేవాలయాల నమూనాలను నిర్మించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంగణాలను తీర్చిదిద్దారు. ఇక్కడ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, వేద పారాయణం, కచేరీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గురజాడ కళాక్షేత్రం, వుడా పార్కు, కైలాసగిరి, మధురవాడలో ఉన్న జాతర ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

ప్రతి వేదిక వద్ద తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలు చాటి చెప్పే కళలు, నృత్యాలు, కోలాటం, తప్పెటగుళ్లు కార్యక్రమాలతో పాటు సినీతారల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆట, పాటలతో పాటు పర్యాటకులను కడుపుబ్బా నవ్వించే హాస్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవ్‌కు వచ్చే సందర్శకుల కోసం ఆర్‌కే బీచ్ నుంచి 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వివిధ సంస్థలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఒకవైపు షాపింగ్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.

ప్రముఖుల రాక
 
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ ఉత్సవ్ వేడుకలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆర్‌కే బీచ్ వద్ద ప్రారంభించనున్నారు. 24వ తేదీన సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అనేక మంది సినీ హీరో, హీరోయిన్లు, సంగీత దర్శకులు, గాయనీ, గాయకులు రానున్నారు. ఉత్సవాలు చివరి రోజు 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
 
పతంగుల వేడుక

 
విశాఖపట్నం-కల్చరల్: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా గురువారం సాయంత్రం గాలిపటాల వేడుక నిర్వహించారు. ఆర్కే బీచ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వేడుకలను ప్రారంభించారు. వుడా, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, మహిళలకు ఉచితంగా గాలిపటాలను అందజేశారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.బాబూరావునాయుడులు పతంగులను ఎగరవేశారు. నగరానికి చెందిన వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాము లై విశాఖ సంస్కృతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు