ఎన్నికల నాటికి ఉత్తరాంధ్ర సుజలస్రవంతి

7 Sep, 2017 01:53 IST|Sakshi
ఎన్నికల నాటికి ఉత్తరాంధ్ర సుజలస్రవంతి
జలసిరికి హారతి కార్యక్రమానికి సీఎం శ్రీకారం
 
సాక్షి, విశాఖపట్నం /విజయనగరం: 2019 ఎన్నికల్లోగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి గోదావరి నీటిని ఉత్తరాంధ్ర జిల్లాలకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.  జలసిరికి హారతి కార్యక్రమాన్ని బుధవారం సీఎం ప్రారంభించారు. విశాఖ జిల్లా కశింకోట మండలంలో శారదానదికి, విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద తోటపల్లి కాలువకు హారతి ఇచ్చారు. ముందుగా ఆయన శారదా నదిపై రూ.17 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ప్రారంభించి నీళ్లు కిందకు వదిలారు. సుజలస్రవంతి ఫేజ్‌–1 కోసం పెదపూడి రిజర్వాయర్‌ పనులకు రూ.2022 కోట్ల అంచనాలతో జారీ చేసిన జీవోను సీఎం ఆవిష్కరించారు.
 
జలసిరిలో అపశ్రుతి: ప్రకృతిని ఆరాధించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమంలో ఆదిలోనే అపశ్రుతి దొర్లింది. విశాఖ జిల్లా కశింకోట మండలంలో శారదానదికి హారతి ఇవ్వడం ద్వారా సీఎం  జలసిరికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. పురోహితులు ఇందుకు హారతిని సిద్ధం చేస్తుండగా  హారతి నుంచి మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే మంటలు ఆర్పినా  ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. తర్వాత అక్కడకు చేరుకున్న సీఎం చంద్రబాబు హారతి ఇవ్వకుండానే మొక్కుబడిగా కార్యక్రమం పూర్తిచేసి వెనుదిరగాల్సి వచ్చింది.
 
బూట్లతో హారతినిచ్చిన సీఎం!: బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కాళ్లకు బూట్లు తొలగించకుండానే పాల్గొన్నారు. చివరకు వేదపండితులు, ఇతరుల సూచనలతో అక్కడే బూట్లు విప్పి మళ్లీ నమస్కరించి వెళ్లిపోయారు.   
>
మరిన్ని వార్తలు