వ్యాక్సినేషన్‌కు సుస్తీ!

29 Aug, 2013 03:04 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  వైద్యుల నిర్లక్ష్యం.. పేదల నిరక్షరాస్యత.. వెరసి చిన్నారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. వైద్యారోగ్య రాజధానిగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్‌లో 1520 మురికివాడలు ఉన్నాయి. ఇక్కడ జాతీయ  ఉచిత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం తగిన విధంగా జరగడం లేదు. ప్రతి శనివారం ఆరోగ్య కేంద్రాల్లోని ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు ఆయా బస్తీల్లో పర్యటించి పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. నిజానికి పల్స్‌పోలియో అప్పుడు తప్ప మిగతా సమయాల్లో అటు వైపు కూడా కన్నెత్తి చూడట్లేదు. తల్లి గర్భం దాల్చిననాటి నుంచి ప్రసవం వరకు, ఆ తర్వాత బిడ్డ పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వరకు వేయించాల్సిన టీకాల జాబితా, తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా, అదేమీ సవ్యంగా జరగడం లేదు.
 
ఇంటింటికీ తిరగకపోవడం వల్లే..

 జీవనోపాధికి నిత్యం అనేకమంది పిల్లపాపలతో కలిసి నగరానికి వలస వస్తున్నారు. వీరంతా బస్తీల్లో తలదాచుకుంటున్నారు. ఊర్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటిముందుకే వచ్చి పిల్లలకు టీకాలు వేస్తే.. నగరంలోని బస్తీలలో మాత్రం ఆరోగ్యకేంద్రాలను, కమ్యూనిటీ హాల్స్‌ను వెతుక్కోవాల్సి వస్తోంది. వాక్సిన్ ఏ రోజు వేస్తారు? ఎక్కడ వేస్తారో ప్రచారం ఉండటం లేదు. దీంతో గతంలో ఒకటి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వారు, వలసల వల్ల ఆ తర్వాతి డోసులను మర్చిపోతున్నారు. టీకాలు వేయించుకోని వారే కాదు, ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేయించుకున్న వారు సైతం డిఫ్తీరియా, కామెర్లు, టీబీ, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు రోగాల బారినపడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఔషధ నిల్వల్లో  తలెత్తుతున్న లోపాలతోనే వ్యాక్సిన్ వికటిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, మిగతా ప్రాంతాలతో పోలిస్తే పాతబస్తీ, సమీప కాలనీల్లో ఢిప్తీరియా, మమ్స్, మీజిల్స్ కేసులు ఎక్కువ నమోదవుతున్నట్లు స్పష్టమవుతోంది.
 
అటకెక్కిన మొబైల్ ట్రాకింగ్ విధానం

 జిల్లా కలెక్టర్‌గా గుల్జార్ ఉన్నప్పుడు బస్తీల్లోని గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలు, వారికిచ్చే వాక్సిన్లు, ఇతర వివరాల నమోదుకు ఆన్‌లైన్ మొబైల్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.లక్షలు వెచ్చించి మొబైల్ ఫోన్లు కొన్నారు. దీని పర్యవేక్షణకు ఫిలింనగర్‌లో తొలిసారిగా  ఐవీఆర్‌ఎస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మరో 18 కేంద్రాలకు సేవల్ని విస్తరించినా.. నిర్వహణ లోపంతో ఈ విధానం అటకెక్కింది.
 

మరిన్ని వార్తలు