వాగులపై హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

20 Sep, 2014 00:46 IST|Sakshi
వాగులపై హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

కొరిటెపాడు (గుంటూరు)
 రహదారులపై వాగులు ప్రహిస్తున్నప్పుడు ఇరువైపులా హెచ్చరికల బోర్డులు పెట్టి ప్రజలు వాగు దాటకుండా చూడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్ నుంచి శుక్రవారం మండలస్థాయి అధికారులతో భారీ వర్షాలపై సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి, పశునష్టం వాటిల్లకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 18 తేదీన కురిసిన వర్షాలకు ముగ్గురు మరణించారని తెలిపారు. తాడికొండ మండలం రావెలకు చెందిన మూల్పూరి శ్రీనివాసరావు (35) కంతేరు వద్ద యర్రవాగులో కొట్టుకొనిపోయినట్లు తెలిపారు. అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన వెలగల సీతామహాలక్ష్మి(55) పిడుగుపాటుకు మృతి చెందినట్లు పేర్కొన్నారు. తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగులో గుర్తుతెలియని మహిళ కొట్టుకొని పోయినట్లు తెలిసిందని, అయితే ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ముగ్గురికి ఆపద్భంధు పథకం కింద ప్రతిపాదనలు పంపించాలని తహశీల్దార్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఒక అధికారిని ఇన్‌చార్జిగా ఉంచి అన్ని రకాల సౌకర్యాలు అందేలా చూడాలని సూచించారు. మంగళగిరి రత్నాల చెరువు కట్టపై ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో వాగులు ప్రవహిస్తున్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల వద్ద ముందస్తు జాగ్రత్తగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు ఆధార్ సంఖ్యతో అనుసంధానం 68 శాతం జరిగిందని తెలిపారు. మ్యుటేషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. త్వరలో స్పెషల్ సమ్మరి రివిజన్‌కు సంబంధించి ఎలక్టోరల్ రోల్‌పై బీఎల్‌వోఎస్, ఏఈవోఎస్, ఏఈఆర్‌వోలకు శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్లు స్టాట్యూటరీ రిజిస్టర్లు ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సెట్ కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, కలెక్టరేట్ పరిపాలనాధికారి బీబీఎస్ ప్రసాదు  పాల్గొన్నారు.



 

మరిన్ని వార్తలు