-

నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి

6 Jan, 2020 05:38 IST|Sakshi
పాలకమండలి సమావేశంలో చైర్మన్‌ వైవీ, సభ్యులు

ఉదయం 5 గంటల నుంచి ధర్మదర్శనం

ఉదయం 9 గంటలకు స్వర్ణరథం  

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 6న తెల్లవారుజామున 12.30 నుంచి 2 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా సోమవారం ఉదయం 5 గంటల నుంచి ధర్మదర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు స్వర్ణరథంపై నాలుగుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ కన్నులపండుగగా జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు చేపడతారు. 

7న చక్రస్నానం 
జనవరి 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గల స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో 5 నుంచి 7 వరకు ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. 

కిక్కిరిసిన తిరుమల.. 
వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ నిండిపోయాయి. వారికి నిరంతరం అల్పాహారం, అన్నప్రసాదం, టీ, కాఫీలు పంపిణీ చేస్తున్నారు. 172 ప్రాంతాల్లో 3 లక్షల వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. 

వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో ఎలాంటి మార్పూ లేదు  
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి 

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విషయంలో ఎలాంటి మార్పూ లేదని, అమల్లో ఉన్న సంప్రదాయాన్నే కొనసాగిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం మండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వైవీ మీడియాతో మాట్లాడుతూ తిరుపతికి చెందిన తాళ్లపాక రాఘవన్‌ వైకుంఠ ద్వారాన్ని ఎన్ని రోజులు తెరుస్తారనే విషయమై హైకోర్టులో పిల్‌ వేశారని, దీనికి సంబంధించి జనవరి 6లోపు నిర్ణయం తెలియజేయాల్సిందిగా హైకోర్టు టీటీడీని కోరిందని తెలిపారు. విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.  వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవాలనే అంశంపై అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశామని, మఠాధిపతులు, పీఠాధితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జనవరి 20 నుంచి శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఉచిత లడ్డూ అందిస్తామన్నారు. సమావేశంలో టీటీడీ ఈవో సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకరరెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు