భద్రాద్రికి ముక్కోటి కళ

1 Jan, 2014 05:22 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 10న పవిత్ర గోదావరిలో తె ప్పోత్సవం, 11న ఉత్తరద్వార దర్శనం వేడుకలను నిర్వహించనున్నారు. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలంలో ఉత్తరద్వారంలో దర్శనమిచ్చే స్వామివారిని కనులారా తిలకిస్తే సర్వపాపాలు తొలగుతాయని, ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తెప్పోత్సవం రోజున భద్రగిరికి చేరుకుంటారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. రామాలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలను అలంకరించారు.
 
 సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు తిలకించేందుకు వీలుగా మిథిలా స్టేడియంలో ప్రత్యేక వేదిక తయారు చేశారు. వివిధ అవతారాలు ధరించిన స్వామివారిని ఈ వేదికపైకి తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచుతారు. ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న మిథిలా స్టేడియంలోని ప్రాంగణంలో చలువపందిళ్లు, షామియానాలు వేశారు. మిథిలా స్టేడియం ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. బుధవారం నుంచి ఈ నెల 9 వరకు పగల్‌పత్తు, 11 నుంచి 21వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. పగల్‌పత్తు ఉత్సవాల్లో స్వామివారు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పర శురామ, శ్రీరామ, బలరామ, శ్రీ కృష్ణావతారములలో భక్తులకు దర్శనం ఇస్తారు. రాపత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికలపై సేవలందుకుంటారు. ఈ ఏడాది సురభి నాటకాలను కూడా ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రదర్శించనున్న ఈ నాటకాలు భక్తులను అలరించనున్నాయి.
 
 తెప్పోత్సవానికి సిద్ధమవుతున్న ‘హంస’
  పవిత్ర గోదావరి నదిలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం జరిగే తెప్పోత్సవం వేడుకులకు హంస వాహనం సిద్ధమవుతోంది. గోదావరిలో సరిపడా నీరు ఉండటంతో లాంచీ తిరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హంసవాహనాన్ని రూపొందిస్తున్నారు.  6వ తేదీ నాటికే హంసవాహనం పనులు పూర్తి చేసేందుకు దేవస్థానం అధికారులు కృషి చేస్తున్నారు. గోదావరి తీరంలో భక్తులు కూర్చొని తెప్పోత్సవాన్ని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హంసవాహనంపై స్వామివారిని తీసుకెళ్లేందుకు గోదావరి ఒడ్డున రోప్‌వే నిర్మిస్తున్నారు.
 
 28న విశ్వరూప సేవ..
 ఈ నెల 28న విశ్వరూప సేవ నిర్వహిస్తారు. రామాలయంలో ఉన్న అన్ని రకాల విగ్రహాలను ఒక చోటకు చేర్చి ఏకారాధన చేసే విశేష ఉత్సవమిది. ఒక్క భద్రాచలం రామాలయంలోనే ఇటువంటి అరుదైన ఉత్సవం జరుగుతుంది. ఆరోజు ప్రత్యేకంగా తయారుచేసిన ‘కదంబాన్నం’ స్వామి వారికి నివేదన ఇచ్చిన తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.
 
 నేటి నుంచి నిత్యకల్యాణాలు నిలిపివేత
 వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారికి బుధవారం నుంచి ఈ నెల 11 వరకు నిత్యకల్యాణాలు నిలిపివేస్తారు. స్వామివారికి ప్రతి రోజూ తిరువీధి సేవ ఉంటుంది.
 
 నేడు మత్స్యావతారం..
 అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు మత్స్యావతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. దశావతారాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో స్వామివారి అలంకరణ చేపట్టి పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పల్లకిపై ఊరేగింపు నిర్వహిస్తూ మిథిలా స్టేడియంలోని వేదికపైకి తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచుతారు.

మరిన్ని వార్తలు