శ్రీవారి సన్నిధిలో రెండు రాష్ట్రాల మంత్రులు

6 Jan, 2020 08:23 IST|Sakshi

సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరెంతో మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో.. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్, మహబూబాబాద్‌ ఎంపీ కవిత మాలోత్‌ ఉన్నారు.
(చదవండి : నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి)

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్‌, పుష్ప శ్రీవాణి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్‌లు సుబ్బరామిరెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి, కనుమూరి బాపిరాజు, పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని, గాలి జనార్దన్‌ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖులు.. రాజేంద్ర ప్రసాద్‌, సునీల్‌, సుమలత, కమెడియన్‌ సప్తగిరి తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విషయంలో ఎలాంటి మార్పూ లేదని, అమల్లో ఉన్న సంప్రదాయాన్నే కొనసాగిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి.. అనంతరం అధ్యయనోత్సవాలు..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలాలయంలో వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారo) గుండా యాదగిరీశుడు భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో యాదాద్రికి చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వైకుంఠద్వార దర్శనం అనంతరం యాదాద్రి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో యాదిగిరికి చేరుకున్నారు. నేటి నుంచి ఆరు రోజులపాటు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. స్వర్ణాలంకార శోభిత గరుడ వాహనంపై స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.  ఉదయం, సాయంత్రం ఆరు రోజులపాటు వివిధ అలంకరణల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ అధికారులు తెలిపారు. 

వైఎస్సార్‌ కడప జిల్లాలో..
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవుని కడప వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించేకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. జిల్లాలోని  వేంపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో  తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. జమ్మలమడుగు నారపుర వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు.

తూర్పుగోదావరిలో..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. జిల్లాలోని రాజమండ్రి వేణుగోపాలస్వామి ఆలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో నిండిపోయింది. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని భక్తులు తరించారు. పిఠాపురం పంచ మాధవ దివ్య క్షేత్రం శ్రీకుంతీ మాధవ స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. 

పశ్చిమగోదావరిలో..
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళ్లకూరు వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. 

విశాఖలో.. 
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచల అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున్న చేరుకుంటున్నారు. సింహాద్రి నాథుని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొత్తగుల్లి భాగ్యలక్ష్మి స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో అప్పన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు.

సూర్యాపేటలో.. 
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ముఖ ద్వారంగా ఉన్న జిల్లాలోని మునగాల మండలం బరఖాత్ గూడెంలో శ్రీవెంకటస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీలక్ష్మీ నృసింహ స్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు.

నల్గొండలో..
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. నార్కట్ పల్లి మండలం శ్రీ వారిజల వేణుగోపాల స్వామి వారి ఆలయం భక్తులు బారులు తీరారు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా