మేజిస్టీరియల్ కాదు.. న్యాయ విచారణ కావాలి

16 Nov, 2014 00:55 IST|Sakshi

 కొత్తపల్లి, న్యూస్‌లైన్: వాకతిప్పలో గతనెల 20న 18 మందిని పొట్టన పెట్టుకున్న బాణసంచా తయారీ కేంద్రం విస్ఫోటంపై మేజిస్టీరియల్ విచారణ కాక.. న్యాయ విచారణ జరిపించాలని బాధితులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. విస్ఫోటంపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ శనివారం రెండో విడత మేజిస్టీరియల్ విచారణ నిర్వహించారు. గ్రామ కారదర్శి, రెవెన్యూఅధికారి, మృతుడు పిల్లి మణికంఠ స్వామి బంధువులు విచారణలో పాల్గొన్నారు. ఈనెల 10ననిర్వహించిన తొలి విడత విచారణను  బాధిత కుటుంబాలు, ఎంఆర్‌పీఎస్ నాయకులు బహిష్కరించిన సంగతి తెలిసిందే.
 
 వాకతిప్పకు చెందిన మృతురాలు ద్రాక్షారపు చిన్నబుల్లి మృతదేహం లభ్యం కాకపోవడం, లభించిన కొన్ని శరీరావయవాలు ఆమెవేనని నిర్ధారణ కాకపోవడంతో పరిహారం ఇవ్వలేదని అప్పుడు కుటుంబ సబ్యులు ఆందోళన చేశారు. కాగా తాజా విచారణ సందర్భంగా చిన్నబుల్లి కుటుంబానికి పరిహారం చెక్కు ఆమె భర్త, తహశీల్దార్ల పేరున వచ్చిందని ఆర్డీఓ తెలిపారు. అయితే జాయింట్ చెక్ తమకు వద్దని కుటుంబసభ్యులు తిరస్కరించారు. అంతేకాక.. విస్ఫోటంపై అధికారులు బాణసంచా తయారీ కేంద్రం యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని బాధితులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు ఆరోపించారు. న్యాయ విచారణ వల్లే న్యాయం జరుగుతుందన్నారు. ఆర్డీఓ విచారణను బహిష్కరించారు.   
 
 ఆర్డీఓ విలేకరులతో మాట్లాడుతూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు తెలిపిన వివరాలను  రికార్డు చేసి కలెక్టరు సమర్పించడమే తన బాధ్యత అన్నారు. అనవసర ఆరోపణలు చేయడం సమంజసం కాదని, ఆధారాలుంటే అందించాలని సూచించారు. విస్ఫోటం జరిగిన మణికంఠ ఫైర్‌వర్క్స్ లెసైన్సు రెన్యువల్ కోసం తనకు దరఖాస్తు రాగా, ఒరిజినల్ లెసైన్సు లేనందున తిరిగి తహశీల్దారుకు పంపించేశానని చెప్పారు. ఆ బాణసంచా కేంద్రానికి 15 కేజీల మందుగుండు తయారీకి మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. విస్ఫోటంలో 18 మృతి చెందినట్టు గుర్తించినా, వారిలో ద్రాక్షారపు చిన్నబుల్లి మృతదేహం లభించకపోవడంతో ఆమె శరీర భాగాలను డీఎన్‌ఏ పరీక్షల కోసం బంధువులతో హైదరాబాద్ పంపించామన్నారు. ఆ నివేదిక వచ్చాక తయారీ కేంద్రంలో ఎంత సామర్థ్యంతో పేలే మందుగుండును వినియోగిస్తున్నారు వంటి వివరాలు తెలుస్తాయన్నారు. ప్రమాద స్థలంలో మట్టి నమూనా, డీఎన్‌ఏ నివేదికలు వచ్చాక మరోమారు బహిరంగ విచారణ నిర్వహిస్తామని చెప్పారు.  
 
 విస్ఫోటానికి 20 రోజుల ముందూ ప్రమాదం..
 విస్ఫోటానికి 20 రోజుల ముందూ మణికంఠ ఫైర్‌వర్క్స్‌లో ఓ ప్రమాదం జరిగిందని మృతుడు మణికంఠస్వామి బావ గంటా వెంకటేశ్వరావు చెప్పాడు. మాట్లాడుతూ...భారీ విస్పోటణానికి 20 రోజుల ముందు ఒక ప్రమాదం జరిగిందని చెప్పారు. అపుడు మణికంఠతో పాటు సత్తిబాబు అనే వ్యక్తి గాయపడగా ఫైర్‌వర్క్స్ యజమానులే ఉప్పాడ ఆస్పత్రిలో చికిత్స చేయించి, మళ్లీ వారితో పనిచేయించుకున్నారన్నారు. ఆ ప్రమాదం జరిగిన వారం రోజుల వరకూ తమకు తెలియనివ్వలేదన్నారు. మణికంఠ ఫైర్‌వర్క్స్‌లో మొదటి నుంచీ భారీగా మందుగుండు సామగ్రి తయారవుతోందన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా