అందంలో.. మకరందం

6 Nov, 2019 04:15 IST|Sakshi

విశాఖ మన్యంలో లాభాలు పూయిస్తున్న వలిసె పూదోటలు

అటు అందాలతో పర్యాటకులకు కనువిందు.. 

ఇటు నోరూరించే తేనెతో పసందు 

ఈ పూల తేనెలో పలు ఔషధ గుణాలు 

విరివిగా వలిసె పూల తేనె విక్రయాలు

వలిసె పూలు.. పసుపు పచ్చగా కనుచూపు మేర పరచినట్లుండే ప్రకృతి పరిచిన ఈ పూదోటల్ని చూసేందుకు విశాఖ మన్యానికి శీతాకాలం పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఏ యూరోప్‌లోనో ఉన్నట్లు అనిపించేలా మన మనసు దోచే ఈ పూలు పిల్లగాలులకు అటూ ఇటూ ఊగుతూ స్వాగతం పలుకుతుంటాయి. ఈ వలిసె పూలు తమ అందంతోనే కాదు మకరందంతోను పర్యాటకుల జిహ్వను వహ్వా అనిపిస్తున్నాయి. అర విరిసిన ఈ పూల మకరందాన్ని జుర్రుకుని తేనెటీగలు అందించే తేనెకు విశాఖ మన్యంలో పర్యాటకుల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. ఔషధ గుణాలతో పాటు మంచి సువాసన, రుచి ఉండడంతో వలిసె సాగు లాభదాయకంగా మారింది.    
– సాక్షి, విశాఖపట్నం

ఇథియోపియా నుంచి విశాఖ మన్యానికి
చూసేందుకు అవి పొద్దుతిరుగుడు పూలుగా కనిపిస్తాయి. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి వందల ఏళ్ల క్రితం ఇవి విశాఖ మన్యంలోకి ప్రవేశించాయి. ఇక్కడి అనుకూల వాతావరణంతో కొన్నేళ్ల క్రితం వరకూ ఎక్కడ చూసినా వీటి అందాలే కనువిందు చేశాయి. అరుకువ్యాలీ, పాడేరు ప్రాంతాల్లోనే 20 వేల ఎకరాల్లో ఈ వలిసె పూలు ఉండేవి. ఇప్పుడు 10 వేల ఎకరాలకు సాగు పడిపోయింది. ఈ పూలతోటల్లో అక్కడక్కడా నీలం రంగుల పెట్టెలు కనిపిస్తుంటాయి. తేనె సేకరించేందుకు పెట్టినవే అవి. శీతాకాలం రెండు నెలలు ఇక్కడ ఇదొక కుటీర పరిశ్రమ. గిరిజనులే గాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తేనె వ్యాపారులు ఈ కాలంలో ఇక్కడికి వస్తుంటారు. వలిసె పూలలో మకరందం ఆస్వాదించే తేనెటీగల్ని ఈ పెట్టెల్లోకి ఆకర్షించేందుకు తయారీదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. 

ఈ తేనెలో మినరల్స్, విటమిన్లు..
సాధారణంగా తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌ ఉంటాయి. ఈ వలిసె పూల తేనెలో ఎంజైమ్‌లు, మినరల్స్, విటమిన్లు, అమినో ఆమ్లాలు ఉంటాయి. ఈ తేనెను గోరువెచ్చని నీరు, నిమ్మరసంతో కలిపి తాగితే పొట్ట తగ్గడమే కాకుండా జీర్ణశక్తి పెరుగుతుందని అంటున్నారు. తేనెటీగలు పరిసర ప్రాంతాల్లోని పూల నుంచే తెచ్చే మకరందం బట్టి వాసన, రంగు మారుతుంటుంది. తేనె కిలో రూ.350 నుంచి రూ.450 వరకూ ఉంటుంది. ఈ పూల నుంచి వచ్చే విత్తనాల్ని గిరిజనులు పప్పు చేసి నూనె తీస్తారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్‌ తయారీలో వినియోగిస్తారు. ఎకరాకు వంద కిలోల వరకూ విత్తనాలు వేస్తే ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ వలిపో గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో ఇటీవల కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ వాడుతున్నారు. 
 వలిసిపూల తోటలో తేనె ఉత్పత్తిదారుడు వెంకటశివరావు 

పర్యాటకులే కొనుగోలుదారులు
మన్యంలో నీలగిరి చెట్లు, కాఫీ తోటల సాగు విస్తీర్ణం ఎక్కువ. సాధారణ రోజుల్లో వీటి పూల నుంచి తెచ్చే మకరందంతోనే తేనెటీగలు పట్టు పెడతాయి. శీతాకాలంలో మాత్రం వలిసె పూలు వస్తాయి. నీలగిరి, కాఫీ పూల కన్నా వలిసె పూల మకరందంతో అధికంగా తేనె దిగుబడి వస్తుంది. ఈ పరిశ్రమ మాకు లాభసాటిగా ఉంది.     
– వెంకటశివరావు, తేనె ఉత్పత్తిదారుడు, కురిడి, డుంబ్రిగూడ మండలం

వారాంతంలో ఎక్కువ గిరాకీ
ఈ సీజన్‌లో అరకు, లంబసింగి, పాడేరు ప్రాంతాలకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది వలిసె పూల తేనె కొంటారు. శని, ఆదివారాల్లో ఐదారు వేల రూపాయల తేనె అమ్ముతాం. మేము ఉత్పత్తి చేసే తేనె పర్యాటకులే ఎక్కువగా కొంటారు. 
– సుహాసిని, తేనె ఉత్పత్తిదారురాలు, చాపరాయి, డుంబ్రిగూడమండలం

ఒక పెట్టె నుంచి 35–40 కిలోల తేనె సేకరణ
ప్రస్తుతం సుమారు 250 ఎకరాల్లోని వలిసె పూల తోటల్లో తేనెపట్టు పెట్టెలు ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో పూల సాంద్రతను బట్టి వంద వరకూ పెట్టెలు పెడతారు. ఒక్కో పెట్టెలో లక్ష వరకూ ఆడ తేనెటీగలు, వంద మగ తేనెటీగలు, రాణి తేనెటీగ ఉంటాయి. ఈ ఒక్కో పెట్టె నుంచి వారానికి మూడు నుంచి నాలుగు కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది. సీజన్‌లో పెట్టెకు 35 నుంచి 40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు నుంచి పాడేరు వెళ్లే రోడ్డు మార్గంలో వలిసె పూల తోటల్లో మనకి చాలాచోట్ల తేనె ఉత్పత్తి పరిశ్రమలు కనిపిస్తుంటాయి. అరకు–కిరండూల్‌ రైల్వే మార్గంలోనూ మనకు దర్శనమిస్తుంటాయి. 

మరిన్ని వార్తలు