న్యాయవాద వృత్తిలో విలువలే ప్రధానం

13 Aug, 2018 02:38 IST|Sakshi
జాతీయ న్యాయ సదస్సులో ప్రసంగిస్తున్న జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌

ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌

పుట్టపర్తి అర్బన్‌: న్యాయవాద వృత్తిలో విలువలే ప్రధానమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులు, న్యాయమూర్తులందరిపై ఉందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న 2రోజుల జాతీయ న్యాయ సదస్సు ఆదివారం ముగిసింది. ఆదివారం ఉదయం 7.50కు సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద ప్రత్యేక పూజలు, వేద పఠనం అనంతరం సుప్రీం కోర్టు మాజీ జడ్జీ జస్టిస్‌ ఏపీ మిశ్రా, రైల్వే క్లెయిమ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ కె.కన్నన్, సత్యసాయి సేవా సంస్థల ఆలిండియా అధ్యక్షుడు నిమీష్‌పాండే, ఉపాధ్యక్షుడు జితేందర్‌ చీమా, ట్రస్ట్‌ మెంబర్లు ఆర్‌జే రత్నాకర్, ప్రసాదరావు సన్మానించారు.

ఉదయం 11 గంటలకు పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన న్యాయ సదస్సులో.. ఉమ్మడి హైకోర్టు జడ్జీ జస్టిస్‌ రామసుబ్రమణ్యం, ఢిల్లీ హైకోర్టు జడ్జీ జస్టిస్‌ సంగీత ధింగ్రా సెహగల్, మణిపూర్‌ హైకోర్టు జడ్జ్జీలు జస్టిస్‌ కోటేశ్వర్‌సింగ్, జస్టిస్‌ హరిశంకర్‌ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమత్వం, లౌకిక సిద్ధాంతాలు చాలా గొప్పవని, పౌర హక్కులు, విధులు ముఖ్యమైనవని చెప్పారు. న్యాయమూర్తులు కొందరు గాంధీ తత్వాన్ని, మరికొందరు గాడ్సే తత్వాన్ని అవలంబించకుండా అందరూ సత్యాన్ని అవలంబిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. న్యాయవాదులు వారి కక్షిదారులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. కక్షిదారులకు హక్కులు తెలుస్తున్నాయి.. కానీ కేసు పూర్వాపరాలు తెలియడం లేదన్నారు. కేసు ఓడినా న్యాయాన్ని గెలిపించాలన్నారు. చేసే పనిలో ఏది తప్పు... ఏది ఒప్పు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీని వల్ల శాంతిని, ధర్మాన్ని రక్షిస్తూ విలువలు పెంపొందించే అవకాశం లభిస్తుంద న్నారు. అనంతరం వేదికపై ఉన్న జడ్జీలను నిర్వాహకులు సత్కరించారు. 

మరిన్ని వార్తలు