ఆ డ్యాం పూర్తి అయితే.. 5 మండలాలు ఎడారే!

15 Jan, 2015 04:27 IST|Sakshi
ఆ డ్యాం పూర్తి అయితే.. 5 మండలాలు ఎడారే!

పాతపట్నం : వంశధార ప్రాజెక్టు విషయంలో నానాయాగీ చేస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహేంద్రతనయ నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్ట వల్ల దిగువనున్న శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు తాగు, సాగు నీరు అందకుండాపోయే ప్రమాదం ఉంది. ఈ డ్యాం నిర్మాణాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, లేనిపక్షంలో జిల్లాలోని ఐదు మండలాలకు ముప్పు ఏర్పడుతుందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలోని గజపతి జిల్లా డంబాపూర్ వద్ద మహేంద్రతనయ నదిపై నిర్మిస్తున్న ఈ భారీ కట్టడాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. డ్యాం వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
 అనంతరం మాట్లాడుతూ రూ.29 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన డంబాపూర్ డ్యాం పనులు గత మూడేళ్లుగా జరుగుతున్నా ఆంధ్ర ప్రదేశ్ పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్మాణాన్ని అడ్డుకోకపోతే వేలాది రైతులు, ప్రజల జీవితాలు ఎడారిగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాం నిర్మాణం పూర్తయితే మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, నందిగాం, పలాస మండలాలకు చెందిన పలు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని వివరించారు. అలాగే మెళియాపుట్టి మండలంలో సుమారు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు చుక్కనీరైనా అందకుండాపోతుందన్నారు.
 
 మహేంద్రతనయ నదిపై మెళియాపుట్టి మండలంలో రెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, అవి కూడా నీరందక వట్టిపోతాయని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న నదిపై ఎగువ భాగంలో మన రాష్ట్ర ప్రమేయం లేకుండానే ప్రాజెక్టులు నిర్మించుకుంటేపోతే, మనకు రావలసిన నీటి వాటా పరిస్థితి ఏమిటని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించారు. తక్షణమే ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రితోపాటు జిల్లా మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఒడిశాతోపాటు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్మాణ పనులు నిలిపివేసేందకు చర్యలు తీసుకోవాలని కోరారు.
 

మరిన్ని వార్తలు