ముంచెత్తిన వంశధార

16 Oct, 2013 06:40 IST|Sakshi

ఆమదాలవలస టౌన్, న్యూస్‌లైన్:  పై-లీన్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వంశధార నది పొంగి పొర్లింది. సుమారు 50 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో నదీతీర ప్రాంతమైన చెవ్వాకులపేట గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే  తహశీల్దార్ జి.వీర్రాజు, ఎంపీడీవో పంచాది రాధ గ్రామానికి వెళ్లి 130 మందిని రామచంద్రాపురంలోని పాఠశాల భవనంలోకి తరలించారు. సోమవారం ఉదయం నుంచి భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికి వంశధార ఉగ్రరూపం తగ్గడంతో పాటు  చెవ్వాకులపేట గ్రామం చుట్టూ వరదనీరు తగ్గడంతో గ్రామస్తులను ఇళ్లకు పంపించారు. వరద ప్రభావంతో ఆనందపురం, చిట్టివలస, చెవ్వాకులపేట, రామచంద్రపురం తదితర గ్రామాల్లోని సుమారు వంద ఎకరాలు నీట మునిగాయి.  ఆమదాలవలస- పురుషోత్తపురం ఆర్‌అండ్‌బీ రహదారి చెవ్వాకులపేట సమీపంలో జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.  
 
 రక్షణ చర్యలు చేపట్టండి
 వరద ముంపునకు గురైన వారికి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అధికారులను ఆదేశించారు. చెవ్వాకులపేట గ్రామాన్ని సోమవారం ఆమె సందర్శించి ప్రజలను పరామర్శించారు. వరద ముప్పు పొంచి వున్న చెవ్వాకులపేట గ్రామాన్ని ఆర్డీవో  ఆర్‌డీఓ గణేష్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి వి.జయరాజ్, పశుసంవర్ధక శాఖ జెడీ నాగన్న, సీఐ వీరాకుమార్, ఎస్‌ఐ మంగరాజు తదితరులు పొన్నాంపేట గ్రామ సర్పంచ్ ఇప్పిలి జయలక్ష్మిని, వరదబాధితులను కలిసి మాట్లాడారు. అనంతరం గ్రామాన్ని సందర్శించారు.
 
  బాధితులను ఆదుకుంటాం..
 వరద బాధితులను ఆదుకుంటామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురీ, పార్టీ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ తెలిపారు. చెవ్వాకులపేట వరద బాధితులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ చెవ్వాకులపేట గ్రామానికి ఏటా వరద ముప్పు తప్పడంలేదన్నారు. గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.చలపతిరావు, జి.శ్రీనివాసరావు, సైలాడ దాసునాయుడు, నాగు, ఎండా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
 
 వరద నీటితో ఆందోళన
 కళింగపట్నం(గార): పై- లీన్ తుపాను ప్రభావంతో ఒడిశాలోని వంశధార నదీపరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో వంశధార నదికి నీరు పోటెత్తింది. మడ్డువలస గేట్లు పూర్తిగా ఏత్తేయడంతో సోమవారానికి నీటి ప్రవాహం ఉద్ధృతమైంది. దీంతో కళింగపట్నం పంచాయతీలోని శ్రీకాకుళం- కళింగపట్నం రహదారి మీదుగా వరద నీరు జోరుగా రావడంతో  తాన్‌సాహెచ్‌పేట, కండ్రపేట, యాతపేట, నగరాలపేట గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తుపాను ప్రభావంతో ఆటుపోట్లు రావడంతో నదీజలాలు సముద్రంలో కలవలేదు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వరదనీరు రానురాను ఉద్ధృతంగా ప్రవహించింది. ముందుగా తాన్‌సాహెబ్‌పేట, కండ్రపేట గ్రామాలకు వరదనీరు ప్రవహిస్తుండడంతో జాతీయ విపత్తుబృందాలు గ్రామంలోకి వచ్చాయి. ఒక దశలో గ్రామాలు ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. గ్రామసమీపంలో సుమారు 20 ఎకరాల  వరిపంట నాశనమైంది. పలు చోట్ల రహదార్లకు గండ్లుపడ్డాయి. తుపాను పర్యవేక్షణాధికారి, గతంలో శ్రీకాకుళం ఆర్డీవోగా పనిచేసిన నక్కా సత్యనారాయణ కళింగపట్నం వచ్చి వరద పరిస్థితిని పర్యవేక్షించారు. రాత్రి 9 గంటల నుంచి వరదనీరు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామాల్లో తహశీల్దార్ బి.శాంతి, ఆర్‌ఐ మురళీధర్ నాయక్‌లు పర్యటించారు.

మరిన్ని వార్తలు