‘వనం–మనం’ అపహాస్యం !

2 Aug, 2018 13:22 IST|Sakshi
ముఖ్యమంత్రి, మంత్రులు నాటిన ప్రదేశంలో ఎండుతున్న మొక్కలు

సీఎం నాటిన మొక్కలకే గతిలేదు

నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించిన సీఎం

నేడు ఎండిపోయిన వైనం

గాలికొదిలేసిన అటవీశాఖ

కృష్ణాజిల్లా ,నూజివీడు: ఇళ్లల్లో చెట్లు పెంచడం కాదు... చెట్లలో ఇళ్లు కట్టుకోవాలి... 2029నాటికి రాష్ట్రంలో మొత్తం భూభాగంలో 50శాతం పచ్చదనం ఉండాలి.. మొక్కలు నాటే కార్యక్రమం 127రోజులు కొనసాగుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు వనం–మనం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చెప్పిన మాటలివి...

కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి ఎంతో ఆర్భాటంగా  ప్రారంభించిన వనం–మనం కార్యక్రమంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కులేకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వనం–మనం కార్యక్రమం  ప్రారంభించిన నూజివీడు ట్రిపుల్‌ఐటీలో  నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. వనం–మనం ప్రారంభించిన చోటే మొక్కల పెంపకం ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఎలా అమలవుతోందో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతనెల 14వ తేదీన వనం–మనం కార్యక్రమాన్ని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

దీనికి గాను అటవీశాఖ అధికారులు ట్రిపుల్‌ఐటీకి చెందిన 10ఎకరాల స్థలాన్ని మొక్కలు నాటడానికి తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రితో మొక్కలు నాటించిన తరువాత అదే ప్రాంతంలో రావి, వేప, టేకు తదితర వేలాది మొక్కలు నాటారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయ్యే వరకు హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత నాటిన మొక్కల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.  ఈ మొక్కలకు నీళ్లు పోసే నాధుడు కూడా లేకపోవడంతో నాటిన మొక్కలు చనిపోతున్నాయి. నాటిన వేలాది మొక్కల్లో ఇప్పటికే  వందలాది వేప మొక్కలన్నీ చనిపోయి ఎండిపోతుండగా, రావిమొక్కలు సైతం ఎండుముఖం పడుతున్నాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా