వంగవీటి రంగాకు వైఎస్‌ జగన్‌ నివాళి

26 Dec, 2017 11:00 IST|Sakshi

విజయవాడ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రంగా వర్ధంతి

సాక్షి, అనంతపురం: కాపు నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం అనంతపురంలో జరిగింది. జిల్లాలో 44వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంటలో జరిగిన వంగవీటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.
 

మా స్ఫూర్తి, ఆదర్శం రంగా: రాధా
విజయవాడ నగరంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలోని బందరు రోడ్డులో గల రాఘవయ్య పార్కులోని రంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగవీటి రాధాకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. ఆయన చనిపోయి ఇన్ని ఏళ్లు అయినా వాడవాడలా అభిమానులు ఆయన వర్థంతిని జరుపుతున్నారని అన్నారు. రంగా ఒక కులం.. ఒక మతం.. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. దేశవిధేశాలలో ఆయనకు అభిమానులున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో రంగా అభిమానులు ప్రతి విషయంలో కలిసికట్టుగా ఉండాలలని ఉద్బోధించారు.

కాగా, నగరంలోని వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర కార్యాలయంలో వంగవీటి వర్ధంతి జరిగింది. పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆసిఫ్, సోమినాయుడు, తోట శ్రీనివాస్, అడపా శేషు, పలువురు కార్పొరేటర్లు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రంగా ఆశయాలను ఆయన అభిమానులు ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. అలాగే స్థానిక రాఘవయ్య పార్కు వద్ద రంగా విగ్రహానికి ఆయన కుమారుడు రాధా నివాళులు అర్పించారు. ఆయనతోపాటు సినీ నటుడు జివి నాయుడు కూడా ఉన్నారు. అనంతరం రంగాపై మెగా సీరియల్‌ తీస్తున్నట్టు జీవీ ప్రకటించి పోస్టర్ ఆవిష్కరించారు.

చిలకలూరిపేటలో..
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రంగా వర్ధంతి సందర్భంగా విశ్వనాథ్ ధియేటర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీ రా​‍ష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు