వనిత అనే నేను లోకల్‌

9 Apr, 2019 11:53 IST|Sakshi

కొవ్వూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కొవ్వూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభతో మెయిన్‌రోడ్డు జనసంద్రమైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత మాట్లాడుతూ తాను ఎప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండే మనిషినని, తాను లోకల్‌ అని ప్రసంగించారు. జగనన్న వస్తున్నాడు... మన జగనన్న వస్తున్నాడు.. మన బతుకులు మారతాయంటూ ఉత్సాహభరితంగా ప్రసంగించారు.

కొవ్వూరు ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యసేవలందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అత్యవసర సమయాల్లో కనీసం ప్రాథమిక వైద్యం అందని దుస్థితి ఉందన్నారు. ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి చేసుకుని ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గోదావరి తీరంలోనే ఉన్నా తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రిసార్ట్స్‌ నిర్మాణం పేరుతో కార్తీకమాసంలో శివలింగాన్ని తొలగించి హిందూ సంప్రదాయాలను దెబ్బతీశారని ఆరోపించారు. శివుడితో పెట్టుకున్న వాళ్లకు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చిందన్నారు. టీడీపీ వాళ్లు పెట్టే ప్రలోభాలకు తలొగ్గవద్దని, ఒక్కసారి ఆలోచించి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైకిల్‌ ఇంటి బయట ఉండాలని, ఏనుగు అడవిలో ఉండాలని, ఫ్యాను ఇంట్లో ఉండాలని, జగనన్న మన గుండెల్లో నిలవాలంటూ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.


బీసీకి ఎంపీ సీటిచ్చిన ఘనత వైసీపీదే: భరత్‌రామ్‌
రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌ పేర్కొన్నారు. మాట తప్పని, మడమ తిప్పని జగనన్నని ఆశ్వీరదించాలని కోరారు. చంద్రబాబు హామీలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మన భవిష్యత్‌ జగనన్న చేతుల్లో పెడదామంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రాజీవ్‌కృష్ణ, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, పార్టీ నేత వంకా రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య, నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి.శ్రీనివాస నాయుడు, నాయకులు బొబ్బా సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బండి పట్టాభి రామారావు(అబ్బులు) తదితరులు మాట్లాడుతూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. పార్టీ నాయకులు కాకర్ల నారాయుడు, పట్టణ అధ్యక్షుడు రుత్తల భాస్కరరావు, వనిత భర్త శ్రీనివాసరావు, ముదునూరి నాగరాజు ఇమ్మణ్ని వీరశంకరం, ముళ్లపూడి కాశీ విశ్వనాథ్, పరిమి హరిచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు