మా కన్నీరు కనిపించదా..?

29 Apr, 2016 00:19 IST|Sakshi

ఎల్.ఎన్.పేట, హిరమండలం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంశధార నిర్వాసితులపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే వారి మాట మరిచిపోయారు. ఆయన మాటలు నమ్మినందుకు వేలాది మంది వంశధారలో మునిగిపోతున్నారు. వంశధార నదిలో వథాగా పోతున్న వరద నీటిని ఒడిసి పట్టి జిల్లా ప్రజల అవసరాలకు సాగు, తాగునీరు అందించేందుకు 2005 ఏప్రిల్ నెలలో జిల్లాలోని హిరమండలం వద్ద 19టిఎంసీల నీటి నిల్వ కోసం సుమారు 10వేల ఎకరాల్లో చేపట్టిన వంశధార రిజర్వాయర్ పనుల్లో 13 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలో ఉండిపోతున్నాయి.
 
 ఆయా గ్రామాలకు చెందిన 7100 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. వీరికి సకల సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించడంతో పాటు ఆర్‌ఆర్ ప్యాకేజీలు చెల్లించాలి. కానీ భూములు తీసుకున్నంత శ్రద్ధగా వారి సంక్షేమం చూడలేకపోతున్నారు. రిజర్వాయర్ పనులకు ఇస్తున్న ప్రాధాన్యం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని వారు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా హిరమండలం బ్యారేజ్ కూడలి వద్ద ఈ ఏడాది జనవరి 20వ తేదీన రిలేనిరాహార దీక్షలకు దిగారు.
 
 దీక్షలు ప్రారంభించి శుక్రవారానికి వంద రోజులైనా ప్రభుత్వం స్పందించలేదు. ఇది తమ బాధలు, తమ కన్నీటికి జరుగుతున్న అవమానమని నిర్వాసితులు వాపోతున్నారు. వంద రోజుల రిలే నిరాహార దీక్షలో ప్రభుత్వం నుంచి పోలీసుల వరకు ఎన్నో అడ్డంకులను స్థానికులు ఎదుర్కొన్నామని, అయినా పోరాటం మానలేదని నిర్వాసిత పోరాట కమిటీ నాయకులు గంగరాపు సింహాచలం చెప్పారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. 

 నిర్వాసితుల డిమాండ్లు ఇవీ..
నిర్వాసితులు కోరిన చోట ఐదు సెంట్లు ఇళ్ల స్థలంతో పాటు సకల సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించాలి.


2005లో పనులు ప్రారంభించినప్పటికీ నిర్వాసితులకు ఇప్పటికీ ఆర్‌ఆర్ ప్యాకేజీలు వర్తింపజేయలేదు. కాబట్టి 2013 భూసేకరణ చట్టాన్ని వంశధార నిర్వాసితులకు అమలు చేయాలి.

రిజర్వాయర్ నీటిలో మునిగిపోతున్న ఇరపాడు, పాడలి, దుగ్గుపురం, తులగాం, బ్యారేజ్ సెంటర్, హిరమండలం (కొంతభాగం), గార్లపాడు, చిన్నకొల్లివలస, చిన్నసంకిలి, పెద్దసంకిలి, సోలిపి తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులు కోరిన చోట పునరావాసం కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.

2015 డిసెంబర్ నెలాఖరు నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలి.

రిజర్వాయర్ నిర్మాణం కోసం పదేళ్ల క్రితం (2005) నిర్ణయించిన అంచనాలు పెంచుతున్నట్లే నిర్వాసితుల ప్యాకేజీలు పెంచాలి.

ఇరపాడు, దుగ్గుపురం, పాడలి, తులగాం, గార్లపాడు, సోలిపి, చిన్నసంకిలి, గదబపేట తదితర గ్రామాల్లో ఇళ్లకు, దేవాలయాలకు కొత్త రేట్లు ప్రకారం  నష్టపరిహారం ఇవ్వాలి.

గూనబద్రకాలనీ, దబ్బగూడ గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించివారికి పునరావాసం కల్పించాలి.

పాడలి, దుగ్గుపురం, పెద్దసంకిలి గ్రామాల్లో వ్యవసాయం చేసేందుకు వీలు లేకుండా ఉన్న మిగిలు భూములకు నష్టపరిహారం చెల్లించాలి.
డి.పట్టా భూములకు జిరాయితీ భూములు మాదిరిగానే పరిహారం ఇవ్వాలి.

ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారితో పాటు ఇంకా ఇళ్లు కట్టుకోవడానికి మిగిలిన వారికి కూడా ఐఏవై ఇళ్లును అనుసంధానం చేయాలి.

రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసిత గ్రామాలకు చెందిన యువతకు రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక కోటా కేటాయించాలి.

నిర్వాసితులందరూ భూములు కోల్పోయినందున ఐఏవై కార్డులు, నెలకు రూ.2వేలు పింఛను ఇవ్వాలి.

కులవత్తులవారికి వత్తిప్యాకేజీ వెంటనే చెల్లించాలి.
 

మరిన్ని వార్తలు