వంశధార వారికే కట్టబెట్టేద్దాం

29 May, 2015 01:14 IST|Sakshi
వంశధార వారికే కట్టబెట్టేద్దాం

రెండోదశ మిగిలిన పనుల్లో పాత కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చే యత్నం
రంగం సిద్ధం చేసిన నీటిపారుదల శాఖ

 
హైదరాబాద్: వంశధార రెండో దశలోని 87, 88 ప్యాకేజీల పనులు పూర్తి చేయలేక చతికిల పడిన కాంట్రాక్టర్లకే.. మిగిలిన పనులను తాజా ధరల ప్రకారం రూపొందించిన కొత్త అంచనా వ్యయంతో కట్టబెట్టడానికి నీటిపారుదల అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ రెండు ప్యాకేజీలను 2005లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్, హార్విన్ కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకున్నాయి. కానీ అప్పటినుంచి రెండుసార్లు గడువు పొడిగించినా పనులు పూర్తి చేయలేకపోయాయి. తాజా ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని పెంచితేనే పనులు పూర్తి చేస్తామని మొండికేశాయి. గత ప్రభుత్వాలు ఇందుకు అంగీకరించలేదు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్యాకేజీల అంచనా వ్యయాన్ని భారీగా పెంచుకోవడానికి ఆ సంస్థలు ప్రయత్నించి విజయం సాధించాయి. మిగిలిన పనుల విలువ రూ.90 కోట్లు కాగా.. తాజాగా ఈ పనుల విలువను రూ.429 కోట్లుగా అంచనా వేశారు. పాత కాంట్రాక్టర్లలో ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యే కాగా.. మరో కాంట్రాక్టర్ టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేతకు స్వయానా సోదరుడు కావడం గమనార్హం.

 తొలి అంచనా వ్యయం రూ.140 కోట్లు

రెండు ప్యాకేజీల తొలి అంచనా వ్యయం రూ.140 కోట్లు.  అందులో దాదాపు రూ. 50 కోట్ల విలువైన పనులు మాత్రమే చేసిన కాంట్రాక్టర్లు మిగతా పనులు చేయకుండా నిలిపివేశారు. ఒప్పందం ప్రకారమైతే కాంట్రాక్టర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకోకపోగా.. తాజా ధరల ప్రకారం మిగిలిన పనుల విలువను రూ.429 కోట్లుగా అంచనా వేశారు. వంశధార విషయంలో నిర్ణయం తీసుకోవడానికి హైపవర్ కమిటీ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించినా గురువారం ఆ సమావేశం జరగలేదు.

కార్యదర్శుల కమిటీతో కానిచ్చేద్దాం..

రూ.100 కోట్ల కంటే తక్కువ విలువైన పనుల విషయంలో కార్యదర్శుల కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. దీంతో హైపవర్ కమిటీకి వెళ్లకుండా కార్యదర్శుల కమిటీలోనే ‘మమ’ అనిపించి పాత కాంట్రాక్టర్లకే కట్టబెట్టాలనే నిర్ణయానికి నీటిపారుదల అధికారులు వచ్చినట్లు తెలిసింది. పాత అంచనా ప్రకారం మిగిలిన పనుల విలువ రూ.90 కోట్లే కాబట్టి తాజా అంచనా విలువ రూ.429 కోట్లను పరిగణనలోకి తీసుకోకుండా, ఫైల్లో పాత విలువనే ప్రస్తావిస్తే హైపవర్ కమిటీకి వెళ్లాల్సిన అవసరం ఉండదనే ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఆ విధంగా ఫైల్ రూపొందించాలని ఇంజనీర్లను నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించారు. వచ్చే వారం కార్యదర్శుల కమిటీ భేటీ ఏర్పాటు చేసి.. అనుకున్నట్టుగా పని కానిచ్చేసేందుకు రంగం సిద్ధమైందని వంశధార ఇంజనీరింగ్ అధికారుల ద్వారా తెలిసింది.
 
 

మరిన్ని వార్తలు