సత్యదేవుని సన్నిధిలో వైభవంగా వరలక్ష్మీ పూజలు

10 Aug, 2013 02:55 IST|Sakshi
అన్నవరం, న్యూస్‌లైన్ : రత్నగిరిపై శ్రీసత్యదేవుని సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ పూజలు శుక్రవారం వైభవంగా జరిగాయి. నిత్యకల్యాణమండపంలో జరిగిన ఈ ఉచిత సామూహిక వరలక్ష్మీ పూజా  కార్యక్రమంలో 1250 మంది మహిళలు పాల్గొన్నారు. ఉదయం పది గంటలకు దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత పండితులు విఘ్నేశ్వరపూజ నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవారికి, ఆ తర్వాత వరలక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. గౌరీపూజ, మండపారాదన, కలశస్థాపన, అనంతరం వరలక్ష్మీ అమ్మవారికి పండితులు శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజ చేశారు. పూజలో పాల్గొన్న మహిళలతో కూడా పూజ చేయించారు. తరువాత వరలక్ష్మీ వ్రతకథను చదివి వినిపించారు. చివరలో వరలక్ష్మీ అమ్మవారికి , సత్యదేవుడు, అమ్మవార్లకు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధాన అర్చకులు కొండ వీటి సత్యనారాయణ, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వర శర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు  నాగాభట్ల పెదవీరభద్రం, భళ్లమూడి సూర్యనారాయణ, ఆకొండి కృష్ణ తదితరులు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న మహిళలు కొబ్బరికాయ, అరటిపళ్లు, పూవులు తెచ్చుకొన్నారు. పసుపు, కుంకుమ, హారతికర్పూరం, అగరువత్తులు, గావంచా, పత్రి, అక్షింతలు, తమలపాకులు, తదితర పూజాసామగ్రిని దేవస్థానమే సమకూర్చింది.
 
 పూజా కార్యక్రమం అనంతరం వరలక్ష్మి రాగి రూపు, తోరం, సత్యదేవుని ప్రసాదం 100 గ్రాముల ప్యాకెట్ అందచేశారు. మహిళలందరూ సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. వీరికి అన్నదానపథకంలో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ పూజలో పాల్గొనేందుకు వెయ్యి మంది మహిళలు తమ పేర్లు నమోదు చేసుకోగా వారికోసం కల్యాణమండపంలో ఏర్పాట్లు చేశారు. ఐతే మరో 250  మంది మహిళలు అదనంగా రావడంతో వారికి కూడా పూజలో పాల్గొనే అవకాశం కల్పించారు. దాంతో మండపం సరిపోకపోవడంతో దానికి ఇరువైపులా గల అంతస్తు మీద కూడా ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమం పూర్తయ్యాక ఉచితంగా ఇచ్చే  స్వామివారి ప్రసాదం, రాగిరూపు పేర్లు నమోదు చేయించుకోనివారికి అందలేదు. 
 
 పూజలకు రెండు వేల మంది పేర్ల్ల నమోదు 
 కాగా, శ్రావణమాసంలో మిగిలిన మూడు శుక్రవారాలలో జరిగే పూజలకు రెండు వేలమంది మహిళలు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. పేర్ల నమోదుకు  ఇంకా సమయం ఉన్నందున మరో రెండు వేల మంది పైబడి పేర్లు నమోదు చేసుకోవచ్చునని అన్నవరం దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.
 
 కుమారా రామ భీమేశ్వరాలయంలో...
 సామర్లకోట : పంచారామక్షేత్రమైన శ్రీకుమారా రామ భీమేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం 250 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో ఉచిత సామూహిక వరలక్ష్మి వత్రాలు నిర్వహించారు. ఆలయ మొదటి అంతస్తులో ఆలయం చుట్టు ఏర్పాటు చేసిన సామూహిక వత్రాల వద్ద లక్ష్మీదేవి చిత్ర పటాలకు పూలమాలలు వేసి దీపారాధన చేసి పూజా కార్యాక్రమాలను ట్రస్టు బోర్డు చైర్మన్ మట్టపల్లి రమేష్‌బాబు, ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటదుర్గాభవాని ప్రారంభించారు.  సామూహిక వత్రాలు చేసుకున్న వారికి పారిశ్రామిక వేత్త బిక్కిన సాయిపరమేశ్వరరావు వరలక్ష్మీ రూపులను ఏర్పాటు చేశారు. 
 
 ఆలయం నుంచి గాజులు, కుంకుమ, పసుపు అందజేశారు. వాటిని ట్రస్టు బోర్డు చైర్మన్ మట్టపల్లి రమేష్‌బాబు, ఈఓ వెంకటదుర్గాభవాని, ట్రస్టుబోర్డు సభ్యులు అందజేశారు. ఆలయ వేదపండితులు వేమూరి సోమేశ్వరశర్మ, కొంతేటి జోగారావు, సన్నిధిరాజు వెంకన్న, చెరుకూరి రాంబాబు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.  మిగిలిన మూడు శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈ పూజలు నిర్వహించనున్నట్టు  ఆలయ కార్యనిర్వహణాధికారి అల్లు వెంకటదుర్గాభవాని తెలిపారు. ట్రస్టు బోర్డు సభ్యులు చుండ్రు సూర్యభాను, మహాంకాళి వెంకటగణేష్, యండమూరి సుబ్బా రావు, కంచుస్థంబం బాపన్న నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 
 రాజమండ్రిలో శ్రావణ శోభ
 సాక్షి, రాజమండ్రి : శ్రావణమాసం తొలి శుక్రవారం ఆధ్యాత్మిక రాజధాని రాజమండ్రిలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గోదావరి తీరం భక్తులతో సందడించింది. నగరానికి తలమానికమైన దేవీచౌక్ ఉదయం నుంచీ ర ద్దీగా ఉంది. దేవీచౌక్‌లోని శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాత్రి దేవీచౌక్‌ను విద్యుత్తు దీపాలతో సర్వాగ సుందరంగా తీర్చి దిద్దారు. నగరంలోని ఇతర ఆలయాల్లో కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
మరిన్ని వార్తలు