అనారోగ్యమే తోడు.. బస్సు షెల్టరే నీడ

2 Apr, 2015 04:09 IST|Sakshi

జీవిత చరమాంకంలో వృద్ధురాలి దయనీయ స్థితి
  భర్త, కొడుకు అర్ధంతరంగా దూరమయ్యారు
  రెక్కల కష్టంతో కూతురిని అత్తారింటింకి పంపింది
  వయసుడిగింది.. ఆరోగ్యం క్షీణించింది
  ఇంటి ఓనరు గెంటేయడంతో రోడ్డున పడింది
  ఐదురోజులుగా దయనీయ స్థితిలో వరలక్ష్మి
 
 రాజాం: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త.. చరమాంకంలో సంరక్షించాల్సిన కొడుకును పోగొట్టుకుంది. కూతుర్ని పెంచి, పెళ్లి చేసి అత్తారింటికి పంపేసింది. ఇప్పుడు వయసుడిగింది. ఆరోగ్యం పడకేసింది. ఇన్నేళ్లూ సహకరించిన రెక్కలు ఇక తమ వల్ల కాదన్నాయి. ఫలితంగా ఆ పండుటాకు మంచానికి పరిమితమైంది. ఇంటి ఓనరు గెంటివేయడంతో బస్సు షెల్టరే ఆమెకు ఆవాసంగా ఎవరో నాలుగు మెతుకులు పెడితే ఆ పూటకు గడి చిందనుకోవడం. లేని నాడు నీళ్లతో కడుపు నింపుకొంటూ క్షణమొక యుగంలా గడుపుతున్న ఆ అభాగ్యురాలు అయినంపూడి వరలక్ష్మి. సుమారు 60 ఏళ్ల వయసున్న ఈ వృద్ధురాలు స్థానిక చీపురుపల్లి రోడ్డులోని పోలీసు స్టేషన్ మలుపు వద్ద ఉన్న బస్సు షెల్టరే ఆవాసంగా నాలుగైదు రోజులుగా కాలం వెళ్లదీస్తోంది.
 
 భర్త చినబాబు, ఇద్దరు పిల్లలతో 18 ఏళ్ల క్రితం రాజాం పట్టణానికి వచ్చిన ఈమె కుటుంబం మల్లికార్జున కాలనీలో ఓ ఇంట్లో అద్దెకుంటోంది. కాలక్రమంలో భర్త, కొడుకు చనిపోవడంతో ఉన్న ఆడపిల్లను తన రెక్కల కష్టంతోనే పెంచి పెద్ద చేసింది. పెళ్లి కూడా చేసి పంపించింది. ఏళ్ల తరబడి శారీరక శ్రమ, వయసు మీద పడటంతో ఆరోగ్యం క్షీణించి మంచం పట్టింది. సరైన భోజనం లేక, చూసే దక్షత లేక శుష్కించిపోయింది. దీంతో ఎక్కడ తమ ఇంట్లో మరణిస్తుందోనన్న భయంతో ఇంటి ఓనరు ఆమెను ఐదు రోజులు క్రితం ఖాళీ చేయించేశాడు.
 
  విధిలేని స్థితిలో స్థానికుల సాయంతో ఉన్న కొద్దిపాటి సామాన్లతో వరలక్ష్మి బస్ షెల్టర్‌లోకి చేరింది. చుట్టుపక్కల వారు దయతలచి ఏదైనా పెడితే తింటోంది. లేనిరోజు ఆకలితో అలమటిస్తోంది. ఈమె దుస్థితిని ఆమె కుమార్తెకు తెలియజేద్దామన్నా  ఆమె అత్తవారి అడ్రస్ చెప్పే స్థితిలో వరలక్ష్మి లేదు. కాగా ఈమె కుటుంబానికి ఇంతవరకు రేషన్, ఆధార్ కార్డు వంటివేవీ మంజూరు కాలేదు. దాంతో పింఛను కూడా అందే పరిస్థితి లేదు. అధికారులను కలిసినా, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ కనికరించలేదని.. ఈ పరిస్థితుల్లో తనను త్వరగా తీసుకుపోవాలని వరలక్ష్మి వేదనతో దేవుడిని ప్రార్థిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, మానవతావాదులు స్పందించి ఆమెకు ఆసరా కల్పించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు