ఎన్నికల అక్రమాలకే డేటా చౌర్యం

6 Mar, 2019 03:59 IST|Sakshi

పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగకరం

ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు వెళ్లడం ఆందోళనకరం

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం

రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

దోషులపై ఐటీ, ఐపీసీ చట్టాల కింద కేసులు నమోదు చేయాలి

వివిధ రంగాలకు చెందిన నిపుణుల డిమాండ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం–7 దరఖాస్తులను ఆన్‌లైన్లో సమర్పించడం జాతీయస్థాయిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై వివిధ వర్గాలకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును, ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని వారు దుయ్యబడుతున్నారు. ప్రజలకు సంబంధించిన డేటా ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలకు అనధికారికంగా వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకే డేటా చౌర్యానికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులమీద ఐటీ, ఐపీసీ సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగించడంపై వివిధ రంగాల నిపుణులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అక్రమాలు, డేటా చౌర్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.  

ఓట్ల తొలగింపు తీవ్రమైన నేరం 
ఓట్ల అక్రమ తొలగింపు తీవ్రమైన నేరం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్లకు తెలియకుండా వారి ఓట్లను తొలగించాలంటూ ఫారం–7తో ఆన్‌లైన్లో దరఖాస్తులు చేయడమంటే పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయడమే. రాజ్యాంగ విరుద్ధమైన ఈ వ్యవహారంపై  ఎన్నికల సంఘం సత్వరం స్పందించాలి. ప్రత్యేక పరిశీలకులను నియమించి రాష్ట్రంలో ఇంటింటికి సర్వే నిర్వహించాలి. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 
– కేజే రావు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ 
 
ఐపీసీ, ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలి 
ప్రభుత్వ పథకాల సందర్భంగా సేకరించిన సమాచారాన్ని కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభంకోసం ఉపయోగిస్తుండడం, ఓటర్ల జాబితాల నుంచి ఓట్లు తొలగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని నా దృష్టికి రాగానే దీనిపై దర్యాప్తు చేయమని ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ప్రభుత్వంపై నమ్మకంతో ఆధార్‌ కార్డు, ఇతర అవసరాలకోసం ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తారు. అలాంటి సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరకుండా గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరిందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజల సమాచార దుర్వినియోగం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం. అందుకు బాధ్యులైనవారిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి రాజకీయాలకతీతంగా చర్యలు తీసుకోవాలి. 
– ఈఏఎస్‌ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్‌ కార్యదర్శి 

చంద్రబాబు ప్రభుత్వానిది దేశ ద్రోహం 
అక్రమంగా ఓట్లను తొలగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఓటుహక్కును కాలరాయడంతోపాటు దేశద్రోహానికి కూడా పాల్పడింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. ఆధార్‌కార్డు, తదితర సమాచారం దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తులకు చేరితే తీవ్ర దుష్పలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు సీఎం చంద్రబాబుతోపాటు యావత్‌ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి. సీఎం ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ ఆధార్‌ ప్రాజెక్టులో కూడా ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు చేరిన వ్యవహారంలో సత్యనారాయణను వెంటనే తొలగించాలి. ప్రభుత్వ పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టాలి. 
– అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే  
 
రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి 
రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజల ఆధార్‌కార్డ్, ఓట్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ప్రైవేటు సంస్థలకు ఎలా చేరాయన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఆ ప్రైవేటు సంస్థలు ఎందుకోసం ప్రజల వ్యక్తిగత వివరాలను తమ వద్ద ఉంచుకున్నాయన్నది కీలకం. ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించేందుకు, ఎలాంటి ఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు ఈ డేటాను చౌర్యం చేశారన్నది నిగ్గు తేలాల్సి ఉంది. ఈ అక్రమాల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.  
– డా.గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞాన వేదిక 

మరిన్ని వార్తలు