రైతులతో వరుణుడి జూదం

22 Jul, 2014 00:48 IST|Sakshi
రైతులతో వరుణుడి జూదం
  • వరినాట్లు పడితేనే బీమా దరఖాస్తుకు అర్హత
  •  ఈ నెలాఖరుతో పంటల బీమాకు గడువు పూర్తి
  • అనకాపల్లి : వరుణుడు రైతులతో జూదమాడుతున్నట్లుగా ఉంది ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి. వర్షాల ఆలస్యం పంటల నాట్లు పైనే కాదు... ప్రభుత్వ పథకాల అర్హతకూ గండి కొడుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షభావమే.

    ఇది ఖరీఫ్‌లో నాట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఏజెన్సీలో మాత్రం వరి నారుమళ్ల నుంచి నాట్లు దశ జోరుగా సాగుతోంది. మైదాన ప్రాంతంలో మాత్రం నారుమళ్ల కోసం రైతులు గత వారం రోజుల వర్షాలు చూసి సన్నద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల నారుమళ్ల దశ పూర్తయింది. అయినప్పటికీ అంచనా వేయలేని వాతావరణ స్థితిగతులు, ఆగస్టు తరువాత విజృంభించే తుపానులు, అల్పపీడనాల దృష్ట్యా ప్రతి రైతుకు పంటల బీమా తప్పనిసరి అవుతోంది.

    బ్యాంక్ ద్వారా రుణాలను తీసుకునే రైతులకు పంటల బీమా సొమ్ము రుణం మంజూరులోనే మినహాయించి ఇస్తున్నారు. అయితే రుణాలు తీసుకోనిరైతుల పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడింది. జిల్లాలో 8 వేల మంది వరకు రుణాలు తీసుకోని రైతులు ఉన్నారు. వారంతా ఇప్పుడు పంటల బీమా పథకం గడువుపైనే ఆందోళన చెందుతున్నారు. జూలై 31 నాటికి వరి పంటపై ఎకరానికి రూ. 555 చొప్పున చెల్లించాల్సి ఉంది.

    మైదాన ప్రాంతంలో ఖరీఫ్, రబీ సాగు క్యాలెండర్ గత కొన్నేళ్ల నుంచి గతి తప్పింది. ఈ కారణంగా నారుమళ్లు ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగగా, సెప్టెంబర్ నెలాఖరు వరకు వరినాట్లు పడుతూనే ఉన్నాయి. కాని వరి పంట బీమా చెల్లింపుకు జూలై నెలాఖరులోనే వరినాట్లను చూపించి రైతు బీమా ప్రీమియం చెల్లించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో రుణాలు తీసుకోని రైతులెవ్వరూ పంటల బీమా పథకానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.  
     
    రంగంలోకి ఇన్సూరెన్స్ అధికారులు...
    జిల్లాలో పంటల బీమా పథకం దరఖాస్తుకు రైతుల నుంచి స్పందన కొరవడడంతో యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు.
     
    వాస్తవానికి గతంలో వ్యవసాయాధికారులే పంటల బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులు నింపి హైదరాబాద్‌కు పంపించాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా బ్యాంకు ప్రతినిధులే రైతుల వద్దకు వచ్చి దరఖాస్తులను సంబంధిత వ్యవసాయాధికారి ద్వారా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇది సానుకూల పరిణామమే అయినప్పటికీ ఈ నెలాఖరులోపు వరినాట్లు చూపించి బీమా మొత్తం చెల్లించే రైతుల మాత్రం కనిపించని పరిస్థితి.
     

మరిన్ని వార్తలు