వరుణుడిపైనే ఆశలు

6 Oct, 2014 02:38 IST|Sakshi
వరుణుడిపైనే ఆశలు

సాక్షి, నెల్లూరు : సెప్టెంబర్ ముగి సినా.. జిల్లాపై వరుణిడి కరుణ కరువైంది. తొలకరి జూన్ మొదలు సెప్టెంబర్ వరకు కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 1,800 చెరువులు ఉన్నాయి. చుక్క నీరులేక బావురుమంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో మెట్ట ప్రాంతాల్లోని 1.50 లక్షల హెక్టార్లలో రబీసాగు ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతలు మాత్రం ఆశ చావక వరుణుడి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5 లక్షల హెక్టార్లు కాగా అందులో 3.5 లక్షల హెక్టార్లు పెన్నాడెల్టా పరిధిలో ఉంది. మిగిలిన 1.5 లక్షల హెక్టార్లు మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలో ఉంది. ఈ మొత్తం వర్షాధారంగా పండాల్సిందే. సరైన వర్షాలు కురిస్తేనే ఇక్కడ పంటలు పండుతాయి.

పుష్కలంగా వర్షం కురిసి చెరువులు నిండితేనే సరి లేకుండా.. పొలాలన్నీ బీళ్లుగా మారే పరిస్థితి ఉంది. కృష్ణా నీళ్లతో పెన్నా డెల్టాలో వరి పంట పండితే మెట్ట ప్రాంతాల్లో మాత్రం తిండి గింజలు పండే పరిస్థితి కనిపించం లేదు. జూన్‌లో 57 మి.మీ సాధారణ వర్షపాతం కాగా,  33.5 మి.మీ మాత్రమే నమోదైంది. జూలైలో 86కు గాను 42.6, ఆగస్టులో 86కు గాను 91.0, సెప్టెంబర్‌లో 102 మి.మీ కాగా 68.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. మొత్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సగటున 331 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 235 .5 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లోకి చుక్కనీరు రాలేదు.

అన్నదాతలు పొలాలాలను బీళ్లుగానే ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే  అక్టోబర్, నవంబర్‌లో వర్షాల కురవవచ్చన్న ఆశతో అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల సాధారణ వర్షపాతం 661 మిల్లీ మీటర్లుగా ఉంది. ఇంతకు మించి వర్షం కురిసిస్తేనే ఈ ఏడాది పంటలు పండే అవకాశం ఉంది. ఒకసారి ఈ స్థాయిలో కానీ..అంతరకు మించి ఎక్కువ స్థాయిలో వర్షాలు కురిసినా అంత నీటికి చెరువుల్లో నీటి నిల్వ చేయడానికి ఆ చెరువుల సామర్థ్యం కూడా లేదు. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే అంత వర్షపాతం నమోదు కాకపోవచ్చన్నది  అంచనా. ఈ నేపథ్యంలో మెట్ట ప్రాంతాల్లో సాగు ప్రశ్నార్థకం కానుంది.

 రబీకి వ్యవసాయ ప్రణాళిక
 రబీ సేద్యానికి వ్యవసాయాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. అక్టోబర్ 25 నుంచి పెన్నాడెల్టాకు సోమశిల నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల సలహా మండలి సమావేశం ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాలో 40 వేల క్వింటాళ్ల  వరి విత్తనాలను  సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. సరైన వర్షాలు కురవని పరిస్థితుల్లో మెట్ట ప్రాంతాలకు పెసర, శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, పొగాకు, పొద్దుతిరుగుడు విత్తనాలను సబ్సిడీతో అందిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే నవంబర్ 20 వరకు రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తారని  ఆ తరువాతే మెట్ట పంటల సాగుకు సన్నద్ధమవుతారని అధికారుల అంచనా. మొత్తంగా మెట్ట ప్రాంతాల్లో సాగు వర్షం పైనే ఆధారపడి ఉంది.



 

>
మరిన్ని వార్తలు