ఈనాడు చంద్రబాబును భుజాలపై మోస్తోంది

5 Apr, 2014 17:14 IST|Sakshi
ఈనాడు చంద్రబాబును భుజాలపై మోస్తోంది

హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఈనాడు దినపత్రిక భుజాలకెత్తుకుని మోస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. 2009 ఎన్నికల్లో ఈనాడు టీడీపీకి అనుకూలంగా ఎన్ని రాతలు రాసినా పరాభవం తప్పలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా అసత్యపు రాతలు రాస్తూ విషం కక్కుతోందని విమర్శించారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి నీతిమాలినపనులకు పాల్పడుతోందని ఆరోపించారు. జగన్ పై లేనిపోని కథనాలను అల్లుతున్నారని పద్మ మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణల్ని ఈనాడు అధిపతి రామోజీరావు నిరూపించాల్సిన అవసరముందని సవాల్ విసిరారు.

చంద్రబాబు అధికారంలోకి రాడనే భయంతో వైఎస్ఆర్ సీపీ, జగన్ పై కుట్రపూరిత కథనాలను ప్రచురిస్తోందని పద్మ విమర్శించారు. రామోజీరావు జర్నలిజాన్ని ఉన్మాద స్థాయికి తీసుకెళ్లారని విమర్శించారు. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా ఈనాడు కథనాలను ప్రచురించిందని పద్మ విమర్శించారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజున ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ నిజమైన వార్తలు రాసిందని చెప్పారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జలయజ్ఞం పనులు నిలిచిపోయాయని, ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం గురించి ఈనాడు ఎందుకు స్పందించలేదని పద్మ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు