ఎఫ్‌సీ లేకున్నా ఆగని వాహనాలు

19 Jun, 2015 03:53 IST|Sakshi
ఎఫ్‌సీ లేకున్నా ఆగని వాహనాలు

- ఆగిన స్కూల్ బస్సుల తనిఖీలు
- యథేచ్ఛగా రోడ్లపై రాకపోకలు
- చోద్యం చూస్తున్న రవాణాశాఖ
చిత్తూరు (అర్బన్):
జిల్లాలో విద్యార్థుల కోసం ప్రైవే టు విద్యా సంస్థలు జిల్లాలో ఉపయోగిస్తున్న బస్సులు, వాహనాల సంఖ్య 1600కు పైనే ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 1020 వాహనాలకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటి ? వీటిని పట్టించుకోరా..? ఎఫ్‌సీలు లేకుండా రోడ్లపైకి వచ్చి పిల్లల్ని తిప్పుతున్నా చూసీ చూడనట్లు ఉంటారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. జిల్లాలో 580 బస్సులకు ఎఫ్‌సీలు లేకుంటే ఏడు బస్సులను మాత్ర మే అధికారులు సీజ్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ రంగు పూసుకున్న కొన్ని విద్యా సంస్థల నిర్వాహకులు అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడమేఇందుకు కారణంగా తెలుస్తోంది.

రవాణాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సారి విద్యా సంస్థలకు చెందిన బస్సులకు ఎఫ్‌సీలు చేయించడం కఠినతరంగా ఉంది. పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి నిబంధనలు బాగానే పెట్టిన.. వాటిని అమలుచేయించడంలో అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. వాహనంలో గ్రిల్స్ ఏర్పాటు చేయడం నుంచి డ్రైవర్ల ఫోన్ నెంబర్లు రాయడం, అతని ఆరోగ్య పరిస్థితి, వైద్య ధ్రువీకరణ పత్రాలు లాంటి నిబంధనలు చదవడానికి బాగానే ఉన్నాయి. కానీ వీటిని వంద శాతం అమలు చేస్తున్న బస్సులు చాలా కొన్నే ఉన్నాయి. ఇప్పటికే ఎఫ్‌సీలు పొందిన పలు వాహనాలు, రవాణాశాఖ గేటు దాటగానే వాటిలో ఉన్న పలు వస్తువులను తీసేసి యథావిధిగా పిల్లలను రవాణా చేస్తున్నారు.

బస్సుల్లో డ్రైవర్, క్లీనర్ యూనిఫామ్ ధరించడం, ప్రతిపాఠశాలలో విద్యార్థుల తల్లితండ్రుల కమిటీ ఏర్పాటు చేసి ఆయా బస్సు డ్రైవర్లు, సహాయకుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలని చెప్పడం లాంటి అంశాలు 5 శాతం విద్యా సంస్థలు సైతం పాటించడంలేదు. ఎఫ్‌సీలు లేని వాహనాలు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతుంటే రవాణాశాఖ అధికారులు చూసీ చూనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 580 బస్సులకు ఎఫ్‌సీలు లేకుంటే ఇటీవల ఏడు వాహనాలను మాత్రమే రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు.
 
దాడులు ముమ్మరం చేస్తాం...
ఎఫ్‌సీలు లేని వాహనాలు రోడ్లపైకి వస్తే సీజ్ చేయమని ఇప్పటికే చెప్పాం. అయితే చాలా వాహనాలు ఇంకా రిపేర్లు చేయించుకుంటూ, ఎఫ్‌సీలకు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అయినా సరే ఎఫ్‌సీలు లేని వాహనాలు రోడ్లపైకి రాకుండా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయమని ఆదేశిస్తాం.
 - సీహెచ్.ప్రతాప్,
జిల్లా ఉప రవాణా కమిషనర్

మరిన్ని వార్తలు