ఏపీకి మరో భారీ పరిశ్రమ

22 Nov, 2019 04:37 IST|Sakshi

1,000 కోట్లతో అనంతలో విద్యుత్‌ బస్సుల తయారీ యూనిట్‌

ఏటా 3,000 బస్సులు తయారు చేసే సామర్థ్యం

వీర వాహన ఉద్యోగ్‌ లిమిటెడ్‌తో కుదిరిన ఒప్పందం

గతంలో కన్నా ఎక్కువ పెట్టుబడికి రిలయన్స్‌ ఆసక్తి

రిలయన్స్, లులూ ఒప్పందాలు రద్దు కాలేదు

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఆటోమొబైల్‌ రంగంలో మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. రూ.1,000 కోట్ల పెట్టుబడి అంచనాతో అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌ ఏర్పాటు కానుందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ‘వీర వాహన ఉద్యోగ్‌ లిమిటెడ్‌’ ఏటా 3,000 బస్సుల తయారీ సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వీర వాహన యూనిట్‌కు 120 ఎకరాలు కేటాయించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా భారీ రాయితీలు కాకుండా విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వివరించారు.

ఆ వార్తలు అవాస్తవం..
గత ప్రభుత్వం రిలయన్స్, లులూ గ్రూపులకు వివాదాస్పద భూములు కేటాయించడంతో వాటిని రద్దు చేసి న్యాయపరమైన చిక్కులు లేని భూములను కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గతంలో కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ గ్రూపు ఆసక్తి చూపించిందని వెల్లడించారు. నెలకు రూ.50 కోట్ల అద్దె ఆదాయం వచ్చే 13.83 ఎకరాల భూమిని గత ప్రభుత్వం లులూ గ్రూపునకు కేవలం రూ.7.09 కోట్లకే కేటాయించడంతో ఏటా సుమారు రూ.500 కోట్లు నష్టం వాటిల్లుతోందన్నారు.

కేవలం భూ కేటాయింపులు మాత్రమే రద్దు చేశామని, ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. లులూ గ్రూపు రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. బయట ప్రచారంలో ఉన్న కాగితంపై కనీసం కంపెనీ లోగో, సంతకం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. గత ఐదు నెలల్లో రాష్ట్రం నుంచి ఒక్క కంపెనీ కూడా వెళ్లకపోయినా ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు.

>
మరిన్ని వార్తలు