పోలీస్ రాజ్!

25 Feb, 2014 03:43 IST|Sakshi
వీరఘట్టం, న్యూస్‌లైన్: సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం.. మొ త్తంగా ప్రజలకు భద్రత కల్పించడంతోపాటు వారిలో విశ్వాసం పెంచాల్సిన పోలీసు వ్యవస్థ వీరఘ ట్టం మండలంలో గాడి తప్పుతోంది. గత కొంతకాలంగా వీరఘట్టం పోలీస్ ఠాణాలోని కొందరు సిబ్బంది వ్యవహార శైలి, కేసులపై స్పందిస్తున్న తీరు తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది. సామాన్యుల నుంచి వ్యాపారస్తుల వరకు స్టేషన్ గడప ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మామూళ్ల మత్తులో అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్న కొందరు సిబ్బంది వల్ల అమాయకులు అన్యాయమైపోతున్నారు. రాజీల పేరుతో ఇక్కడ జరుగుతున్న తతంగం దీనిపై సెటిల్‌మెంట్ల స్టేషన్ అన్న ముద్ర వేస్తోంది. కొద్దిమంది అక్రమ చర్యల వల్ల స్టేషన్ మొత్తం అపప్రదను మూటగట్టుకుంటోందన్న విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు గుర్తించడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ స్టేషన్ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇక్కడి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
 
 ఇసుకాసురులతో రహస్య ఒప్పందాలు 
 ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఇటు పర్యావరణాన్ని.. అటు ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్న ఇసుకాసురులతో రహస్య ఒప్పందాలు చేసుకొని అక్రమ రవాణాకు మార్గం సుగమం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని నాగావళి తీర ప్రాంతాలైన పనసనందివాడ, బిటివాడ, చిదిమి, కడకెల్ల, విక్రమపురం, మొట్టవెంకటాపురంతో పాటు స్థానిక ఒట్టిగెడ్డలో నిత్యం పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పోలీసులకు తెలియకుండా ఇదంతా జరగడం లేదు. వీరి నుంచి ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బెదిరించి మరీ మామూళ్లు వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ యజమానులు చెబుతున్నారు. అలాగే మద్యం షాపు యజమానులు, బెల్టుషాపులు నిర్వహించే వారు, ఇతర అక్రమ వ్యాపారాలు చేసే వారంతా స్టేషన్ మామూళ్ల పేరిట నెలనెలా వేలాది రూపాయలు సమర్పించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేసుల నమోదు విషయంలో ఇక్కడి సిబ్బంది అనుసరిస్తున్న తీరు ఫిర్యాదు చేసేందుకే వెనుకంజ వేసేలా చేస్తోంది. డబ్బులు ఇస్తే ఒకలా.. ఇవ్వకపోతే ఒకలా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇటువంటి కొన్ని ఆరోపణలు పరిశీలిస్తే..
 
   గత ఏడాది నవంబరులో ఓ కర్రల లారీని పట్టుకొని రూ. 60 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  జనవరి 3వ తేదీన ఒక సంఘటనలో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా ఉండడానికి రూ. 35 వేలు వసూలు చేసినట్లు తెలిసింది.
   జనవరి 10న మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజనుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేలు వసూలు చేసినట్లు  సమాచారం.  ఇక రైస్ మిల్లర్ల నుంచి ప్రతి నెలా బియ్యం దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  తాజాగా కడకెల్ల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నా.. ఖాళీగా ఉన్నాయన్న నెపంతో వాటిని వదిలిపెట్టారు.
 
 చర్యలు తీసుకుంటా:ఎస్సై
 ఈ ఆరోపణలపై ఇటీవలే ఇక్కడ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఆర్.శ్రీనివాసరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా వీటిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. బాధ్యతలు చేపట్టి నెల రోజులే అయినందున ఇంతకుముందు స్టేషన్‌లో ఏం జరిగిందో తెలియదన్నారు. అక్రమ వసూళ్లు, ఇతర ఆరోపణలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని వార్తలు