ఏం కొనేటట్లు లేదు...ఏం తినేటట్లు లేదు

10 Mar, 2019 12:14 IST|Sakshi
కూరగాయలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు   

సాక్షి, ఆమదాలవలస రూరల్‌ : కొన్ని రోజులుగా ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇదివరకు కొద్దిపాటి సొమ్ముతో మార్కెట్‌కు వెళ్తే వారం రోజులకు సరిపడా సరుకులు వచ్చేవని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని వాపోతున్నారు. ఇలాగే ధరలు కొనసాగితే పూట గడవడం కూడా కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


దడ పుట్టిస్తున్న ధరలు
బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బజార్‌ దుకాణాల్లో కూడా అధిక ధరలే ఉన్నాయి. దీంతో అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసి పొదుపుగా వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కానీ ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తనట్లు వ్యవరిస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


మాంసం ప్రియులకు చేదు వార్త 
కూరగాయల ధరలతో పాటు చికెన్‌ ధరలు కూడా పెరుగుతుండడంతో మాంసం ప్రియులు చికెన్‌ తినే పరిస్థితి లేదు. బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పత్తి తగ్గుతుండడంతో చికెన్‌ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కిలో చికెన్‌ ధర రిటైల్‌ మార్కెట్లో రూ.160లుగా ఉంది. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ధరలు మరో రూ.20 నుంచి రూ.50 పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.


ధరలు అదుపు చేయాలి 
ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు మూడుపూటలా తినే పరిస్థితి లేదు. ధరల దెబ్బతో ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-కూన రామకృష్ణ, కృష్ణాపురం


ఏమీ కొనే పరిస్థితి లేదు 
గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కూరగాయల ధరలు ఆమాంత పెరిగిపోయాయి. దీనివలన ఏమీ కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. ధరలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. 
-బొడ్డేపల్లి రవికుమార్, తిమ్మాపురం

మరిన్ని వార్తలు