వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోండిలా

10 Mar, 2016 01:10 IST|Sakshi

పాలకోడేరు రూరల్ :వాహనాలను కొనుగోలు చేసిన వారు విధిగా రిజస్ట్రేషన్  చేయించుకోవాలి. వాహన కంపెనీ డీలర్ నుంచి టీఆర్ తీసుకున్న 30 రోజుల్లో పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు భీమవరం ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్డీవో) జె.రమేష్‌కువూర్. రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం, తదితర వివరాలు ఆయన మాటల్లోనే..
 
 తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)
 వాహనం కొనుగోలు చేసినప్పుడు సదరు వాహన కంపెనీ డీలర్ తాత్కాలిక రిజస్ట్రేషన్ (టీఆర్) నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌తో ఉండే రిజస్ట్రేషన్ కేవలం 30 రోజులు మాత్రమే పనిచేస్తుంది. 30 రోజుల్లోపు వాహనానికి పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోవాలి.
 
 పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పొందండిలా
 పర్మినెంట్ రిజస్ట్రేషన్ కోసం సమీపంలోని ప్రాంతీయు రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వాహనానికి సంబంధించి డీలర్ ఇచ్చిన పత్రాల కాపీలను జత చేయాలి. ద్విచక్ర వాహనం అయితే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, హెల్మెట్ బిల్లు జత చేయాలి. కారు యజమాని అయితే ఆధార్, పాన్ కార్డు కాపీలను జత చేయాలి. ద్విచక్ర వాహనానికి అయితే రూ.445, ఆటోకు రూ.350, కారుకు రూ.635, ట్రాక్టర్‌కు రూ.700, లారీకి రూ.900, ఇతర మినీ లారీలకు రూ.625 చొప్పున చలానా రూపంలో చెల్లించాలి. అనంతరం దరఖాస్తును ఆర్టీవో సిబ్బంది హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) విభాగానికి పంపిస్తారు.
 
 హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం..
 హెచ్‌ఎస్‌ఆర్‌పీ విభాగం దరఖాస్తును పరిశీలించి అదే రోజున పర్మినెంట్ నంబర్ కేటాయించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) ఇస్తుంది. ఈ నంబర్ ప్లేట్ కోసం ద్విచక్ర వాహనానికైతే రూ.245, నాలుగు చక్రాల వాహనాలకైతే రూ.630 రుసుము వసూలు చేస్తారు. అనంతరం వాహనాన్ని పరిశీలన కోసం రిజస్ట్రేషన్ దరఖాస్తును అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ (ఏఎంవీఐ)కి పంపిస్తారు. ఏఎంవీఐ ఆ వాహనాన్ని పరిశీలిస్తారు. డీలర్ ఇచ్చిన పత్రాల్లోని వివరాల ఆధారంగా వాహనం మోడల్, ఛాసిస్ నంబర్, ఇంజిన్, వాడే ఇంధనం తదితర అన్ని వివరాలను పరిశీలిస్తారు. ఫారం-21 ప్రకారం అన్నీ పరిశీలించి.. వివరాలన్నీ సక్రమంగా ఉంటే ఆమోదం తెలియజేస్తారు. అనంతరం దరఖాస్తును ఏపీ ట్రాన్స్‌పోర్ట్ డాట్ ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయినట్టే. అనంతరం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (ఆర్‌సీ) వివరాలు పొందుపర్చిన కార్డును దరఖాస్తు చేసిన నాలుగు రోజుల్లో పోస్టు ద్వారా వాహన యజమాని ఇంటికి పంపిస్తారు. ఆర్‌సీ కార్డులో వాహనం రకం, మోడల్, వాడే ఇంధనం, రంగు, యూజవూని పేరు, చిరునామా తదితర వివరాలు ఉంటాయి.
 
 రిజస్ట్రేషన్ చేయించకపోతే..
 వాహనం కొనుగోలు సవుయుంలో ఇచ్చే తాత్కాలిక రిజస్ట్రేషన్ గడువు 30 రోజుల్లోపు పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోకపోతే తనిఖీల సమయంలో వాహనాన్ని సీజ్ చేస్తారు. వాహన యజమానికి జరిమానా కూడా విధిస్తారు. ద్విచక్ర వాహనమైతే రూ.2 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
 

మరిన్ని వార్తలు