ఆఫ్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్‌

26 Feb, 2020 12:28 IST|Sakshi
షేక్‌ కరీం

28 నుంచి మార్చి7 వరకూ అవకాశం

ఆర్టీఓ షేక్‌ కరీం

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఈ నెల 28 నుంచి మార్చి 7 వరకూ వాహనాల బదిలీ రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో స్వయంగా లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్టీఓ షేక్‌ కరీం తెలిపారు. ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సుమారు 1500 వాహనాలు అమ్మకాలు జరిగిన తరువాత ఓనర్‌షిప్‌ మార్పులు చేసుకోకుండా ఉండిపోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల వాహనాలు ఈ విధంగా యాజమాన్యం మార్పు లేకుండా ఉండిపోయాయన్నారు. ఈ విధమైన వాహనాలు రిజిస్ట్రేషన్‌లో స్వయంగా మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ఇప్పటి వరకూ అమ్మకం జరిపిన వాహనం ఓనర్‌షిప్‌ మారాలంటే అమ్మకందారుడు, కొనుగోలు దారుడు ఇద్దరూ ఉండాల్సి వచ్చేదన్నారు. కానీ వారం రోజుల పాటు ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టి స్వయంగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి వాహనాలు బదిలీని చేసుకునే వీలు కల్పించిందన్నారు. 

వాహనం సేల్‌ లెటర్‌తో పాటు పొల్యూషన్‌ సర్టి ఫికెట్, ఇన్సూరెన్స్, సీబుక్, మొదలగు సర్టి ఫికెట్లతో కొనుగోలుదారుడు కార్యాలయానికి వస్తే ఈ మార్పులు చేసుకోవచ్చన్నారు. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు అమ్మకందారులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో వాహన యాజమాన్యం మార్పులు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆటో యజమానులు సైతం మార్పులు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ లావాదేవీలు జరపడానికి దళారులను ఆశ్రయించవద్దన్నారు. స్వయంగా కార్యాలయానికి వచ్చి అధికారుల సహాయం పొందాలన్నారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. 

మరిన్ని వార్తలు