లిక్కర్‌ సామ్రాజ్యంలో వసూల్‌రాజా

26 May, 2019 04:03 IST|Sakshi

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే ‘వెలగపూడి’ అరాచకాలు

ఎన్నికల ఖర్చులకు భారీగా వసూళ్లు

సాక్షి, విశాఖపట్నం : ‘మళ్లీ టీడీపీ ప్రభుత్వమే వస్తుంది.. మద్యం లైసెన్సుల గడువు పెంచే బాధ్యత నాదే. ఎన్నికల ఖర్చు మీదే’.. అంటూ విశాఖ తూర్పు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెలగపూడి రామకృష్ణబాబు జిల్లాలోని మద్యం వ్యాపారులను వేధించిన తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మద్యం వ్యాపారుల నుంచి ఆయన భారీఎత్తున వసూళ్లకు పాల్పడడంపై ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంతోనే ఆయన ఎన్నికల్లో గట్టెక్కినట్లు సమాచారం. వాస్తవానికి వెలగపూడి ఆది నుంచి వివాదాస్పదుడే. విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఆయన అక్కడ నుంచి తప్పించుకుని విశాఖ వచ్చారు. ఇక్కడ రహస్యంగా కొన్నాళ్లు గడిపాక తొలుత మద్యం వ్యాపారంలో పాతుకుపోయారు. ఆ తర్వాత 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. అధికార బలంతో ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు.

విశాఖలో తమ సిండికేట్ల మద్యం షాపులపై దాడులు జరగకుండా చూసుకుంటూ వచ్చారు. ఇలా విశాఖ మద్యం సిండికేట్లలో వెలగపూడి చక్రం తిప్పుతున్నారు. అయితే, ఈసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో సానుకూలత అధికంగా ఉండడంతో తన గెలుపు కష్టమని తేలడంతో ముందుగానే వ్యూహం రచించారు. విశాఖలో తనకు అండగా నిలిచే మద్యం సిండికేట్లకు తన గెలుపు బాధ్యతను అప్పగించారు. ఈ ఎన్నికల్లో వెలగపూడి ఓట్ల కొనుగోలు, ఇతర ఖర్చులకు రూ.2 కోట్లు సిండికేట్లు సమకూర్చినట్టు తెలిసింది. ఈ సొమ్మును దశల వారీగా జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ల నుంచి వసూలుచేయాలని హుకుం జారీచేశారు. అందులో భాగంగా ఒక్కో షాపు/బార్‌ రూ.50 వేలు టార్గెట్‌ విధించారు. తొలివిడతగా రూ.16వేలు చెల్లించాలన్నారు. విశాఖ జిల్లాలో 402 మద్యం షాపులు, 131 బార్లు ఉన్నాయి. వీటిలో కొంతమంది వ్యాపారులు నిరాకరించినప్పటికీ 75 శాతం మంది ఆ సొమ్ము చెల్లించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు ముందుగానే ఎమ్మెల్యే వెలగపూడి స్కెచ్‌ వేశారు. మద్యం వ్యాపారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి వీలుగా ఒక్కో లిక్కర్‌ బాటిల్‌కు ఎమ్మార్పీ ధరకంటే రూ.5 అదనంగా అమ్ముకోవడానికి ఉన్నతాధికారుల నుంచి అనధికార అనుమతులు తెచ్చారు. 

ఎక్సైజ్‌ ఉన్నతాధికారి అండ..
ఎక్సైజ్‌ శాఖలోని ఓ ఉన్నతాధికారితో తనకున్న పలుకుబడితో కిందిస్థాయి అధికారులను వెలగపూడి బెదిరిస్తూ ఉంటారు. ఈ ఉన్నతాధికారి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు సమీప బంధువు. ఆయనతో సాన్నిహిత్యం పెంచుకుని విశాఖ నగరంలో వెలగపూడి అండ్‌ కో సిండికేట్‌ నడుపుతున్న మద్యం షాపులపై దాడులు జరగకుండా చూశారు. ఈ ఎన్నికల్లో మద్యం దుకాణాలపై దాడులకు రాజధాని కేంద్రంగా ఉన్న స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నగరంలో షాపుల వైపు చూడకుండా కట్టడి చేయగలిగారు. 

>
మరిన్ని వార్తలు