వెలిగొండ పనులు టీడీపీ ఎంపీకి!

15 Oct, 2017 13:12 IST|Sakshi

సిద్ధమైన సర్కార్‌

నేడో రేపో ఉత్తర్వులు జారీ

చేతులు మారిన రూ.కోట్లు

పాత కాంట్రాక్టర్ల ఆగ్రహం

బకాయిలు ఇవ్వలేదంటూ ఫైర్‌

నిధులివ్వకుండా పనులు చేయమంటున్నారని ఆరోపణలు

రేట్లు పెంచి పనులు అప్పగింత..?

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ఇష్టానుసారంగా మార్చి వేస్తోంది. ఇటీవలే  రూ.91.15 కోట్ల కొల్లంవాగు హెడ్‌రెగ్యులేటర్‌ పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి తప్పించి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి చెందిన ఆర్‌కె ఇన్‌ఫ్రాకు కట్టబెట్టిన సర్కారు తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని టన్నెల్‌–1, 2 పరిధిలోని పనులను సైతం కొత్త కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. టన్నెల్‌–1 పనులను కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి అప్పగించనున్నారు.

 టన్నెల్‌–2 పనులను కోస్తా ప్రాంతానికి చెందిన మెగా కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పనుల కేటాయింపుకు సంబంధించిన తంతు నేడో.. రేపో..ముగియనుంది. ఇప్పటికే ఒకమారు అంచనాలను పెంచుకొని పనులు వేగవంతం చేయని ప్రభుత్వం టన్నెల్‌–1,2 పనుల అంచనాలను మరోమారు భారీగా పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు సిద్ధమైంది. పనుల అప్పగింతకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో పెద్దలకు కోట్లాది రూపాయల ముడుపులు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటి వరకు టన్నెల్‌–1 పనులను ప్రసాద్, షూ, సబీర్‌ జాయింట్‌ వెంచర్‌ చేస్తుండగా కోస్టల్‌ కంపెనీ టన్నెల్‌–2 పనులను చేస్తోంది. టన్నెల్‌–1 పనులు 18.820 కిలోమీటర్ల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 14.755 కి.మీ మాత్రమే చేశారు. ఇక టన్నెల్‌–2 పనులు 18.838 కి.మీకు గాను ఇప్పటి వరకూ 10.72 కి.మీ మాత్రమే  చేశారు. టన్నెల్‌–2 పనులు పూర్తిగా ఆగాయి.  ప్రభుత్వం  నిధులివ్వకపోవడంతోనే పనులు చేయలేని పరిస్థితి  నెలకొందని  పాత కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇప్పటి వరకూ రూ.50 కోట్లమేర  పాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు  పాతరేట్లు  గిట్టుబాటు కావడం లేదని, రేట్లు పెంచాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అయినా పట్టించుకోని సర్కార్‌ రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచి పనులను అధికార పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. పనులు అధికార పార్టీకి చెందిన ఎంపీ, మరికొందరికి అప్పగించేందుకు ఇరిగేషన్‌ కీలక అధికారి కీలకపాత్ర పోషించగా కిందిస్థాయి అధికారులు సైతం ఇందుకు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. తొలుత పనులు అప్పగించిన కాంట్రాక్టర్లకు నిధులిచ్చి పనులు వేగంగా వేయించడంలో శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం దానిని గాలికొదిలింది. అవే పనులను మరోమారు కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి కోట్లు కొల్లగొట్టేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది.

 పనులు స్వాధీనం చేసుకున్న కాంట్రాక్టర్లు మొబిలైజేషన్‌ అడ్వాన్సులతో అందిన కాడికి దండుకొని ఆ తర్వాత పనులు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. కొల్లంవాగు హెడ్‌రెగ్యులేటర్‌ పనులను సైతం జులైలో అధికార పార్టీ నేతకు అప్పగించినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం గమనార్హం. వెలిగొండ టన్నెల్‌–1 పనితో పాటు కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ పనిని పూర్తి చేసి తొలుత 2017 నాటికే నీళ్లిస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు మాట మార్చి 2018 డిసెంబర్‌కు నీళ్లిస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. పనుల తీరు ఇలాగే కొనసాగితే మొదటి దశ పనులు ఏడాదిలో పూర్తి కావడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టుల పేరుతో కోట్లు కొల్లగొట్టడం మాని చిత్తశుద్ధితో పని చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు