మెట్టకు అండ వెలిగొండ

18 Mar, 2020 13:01 IST|Sakshi
పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ కింద పూర్తయిన ఉదయగిరి కాలువ

ప్రాజెక్ట్‌ పనులపై సీఎం ప్రత్యేక దృష్టి

త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు

ఉదయగిరిలో 52 వేల ఎకరాల సాగుకు అవకాశం

మెట్ట రైతుల్లో చిగురించిన ఆశలు  

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులు వేగవంతగా జరుగుతున్నాయి. దుర్భిక్షమైన మెట్టప్రాంతాలను ఆదుకునేందుకు దాదాపు 15 ఏళ్ల క్రితం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన అకాల మరణం తర్వాత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. మూడు దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆదుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వైఎస్సార్‌ కలను నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్ట్‌ పనులు త్వరతిగతిన పూర్తి చేసేందుకు సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్‌ నాటికి ఈ పనులు పూర్తయితే, రెండో దశలో జిల్లాకు సంబంధించిన పనులు పుంజుకోనున్నాయి.  

ఉదయగిరి: డెల్టా ప్రాంతంగా గుర్తింపు పొందిన జిల్లా పశ్చిమ దిశలోని ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతో పాటు వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లోని భూములకు సాగునీరు, తాగు నీరు అందించేందుకు 2004లో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయనమరణానంతరం అధికారం చేపట్టిన అప్పటి కాంగ్రెస్‌ పాలకులు, ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2019లో అధికారం చేపట్టిన వైఎస్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేసేందుకు నడుం బిగించారు. అందులో భాగంగా ఇటీవల ప్రాజెక్ట్‌ను సందర్శించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది జూన్‌కల్లా మొదటి దశ పనులు పూర్తి చేసి రెండో దశ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వైఎస్సార్‌ సీఎంగా 2005 నుంచి 2009 వరకు ఈ ప్రాజెక్ట్‌ పనులను శరవేగంగా చేపట్టారు. ఆయన మరణంతో పనులు నత్తను తలపించాయి. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్‌పై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అంతకు ముందు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి తమ బినామీ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టినా పనుల్లో పురోగతి లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మూడు జిల్లాల మెట్ట రైతులు దిగాలు పడ్డారు. 

మళ్లీ చిగురించిన ఆశలు  
కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఎగువ భాగాన కొళ్లాం ప్రాంతంలోని హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసి అక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 4,47,300 ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ ఏడాది జూన్‌ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి కొంత మేర ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఇందుకు అవసరమైన రూ.185 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు అంగీకరించింది. రెండో దశ పనులకు అవసరమైన రూ.1,600 కోట్లు కూడా యుద్ధప్రాతిపదికన అందజేసేందుకు సీఎం సుముఖంగా ఉన్నారు. దీంతో రానున్న నాలుగేళ్లలో చివరి ఆయకట్టుకు నీరందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే జిల్లాలోని ఐదు మండలాల్లో 84 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో ఉదయగిరిలోని నాలుగు మండలాలకు 47 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. 

శరవేగంగా పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ పనులు  
ఈ ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా నిర్మించనున్న పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నల్లమల సాగర్‌ నుంచి 139 కి.మీ పొడవుతో తవ్విన కాలువ ద్వారా ఈ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి నీరు వస్తుంది. ఇక్కడ 2.02 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ రిజర్వాయర్‌ నుంచి 39.8 కి.మీ మేర ఉదయగిరి ఉప కాలువను తవ్వారు. తద్వారా గండిపాళెం రిజర్వాయర్‌కు కూడా నీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు మండలాలకు సాగు, తాగునీరందుతుంది. సీతారామపురం వద్ద నిర్మించ తలపెట్టిన సీతారామసాగర్‌లో పది టీఎంసీల నీరు ఉంటుంది. దీంతో మెట్ట ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుంది.

మెట్టప్రాంతం సస్యశ్యామలం
ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గంలోని 75 శాతం మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. పెద్దిరెడ్డిపల్లి సీతారామసాగర్‌ రిజర్వాయర్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రాజెక్ట్‌ పరిధిలోకి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన బీడు భూములను చేర్చేందుకు అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాను. ఈ ఐదేళ్లలోనే సాగునీరు, తాగునీరు అందుతుంది. నెల క్రితం మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పెద్దిరెడ్డిపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరును సందర్శించారు. అడ్డంకులను అధిగమిస్తామని తెలిపారు.  – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు