'40 ఇయర్స్‌ ఇండస్ట్రీ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం'

26 Feb, 2020 15:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీయే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు  ప్రారంభించింది. పేదలకు ఇళ్ళ స్ధలాల కేటాయింపులపై విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్‌ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'జిల్లా వ్యాప్తంగా 4 వేల ఎకరాల భూములు సేకరించాం. విజయవాడలోని పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఎస్సీల స్థలాలు లాక్కుంటున్నామని చంద్రబాబు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొనే నువ్వు ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. మీ ప్రభుత్వంలో గజం భూమి ఇవ్వలేని మీరు.. మేము సెంటు భూమి ఇస్తే మాపై విమర్శలా..? చదవండి: ‘ఆ ఖర్చుతో రాష్ణ ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు’

జక్కంపూడిలో ఇళ్లు ఇస్తామంటూ విజయవాడలోని పేదల వద్ద టీడీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారు. 5 వేల ఇళ్లుంటే 9 వేలకు పైగా ఇళ్లంటూ స్లిప్పులిచ్చి మోసం చేయడానికి సిగ్గులేదా..? పేదల రక్తంతో ఇల్లు కట్టి వారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. మా ప్రభుత్వంలొ పేదలకు ఇల్లిస్తే విమర్శలు చేస్తారా..? ఇళ్ల కోసం గత ప్రభుత్వానికి డబ్బులు కట్టిన వారికి మేం అన్యాయం చేయం. వారికి కూడా అన్ని విధాలుగా న్యాయం చేస్తాం. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇల్లు ఇవ్వాలని జగన్ సంకల్పించారు. ప్రతిపక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని' మంత్రి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్‌ హయాంలో జక్కంపూడిలో 17వేల ఇళ్లు ఇస్తే జగన్ సీఎం అయ్యాక విజయవాడలో 80 వేల మందికి ఇళ్లు ఇవ్వడం శుభపరిణామం. టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే మేము సహించం. పేదలకు ఇళ్లిస్తున్న ఘనత జగన్‌దే. ఓట్ల కోసమే గత ప్రభుత్వం ఇళ్ల పేరుతో నాటకాలాడి దోచుకుంది. మా ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తాం. అర్హులైన ప్రతిఒక్కరికి ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చదవండి: చంద్రబాబు ఇక నీ ఆటలు...మాటలు సాగవు

మరిన్ని వార్తలు