'క్లియరెన్స్‌ రాగానే భక్తులను అనుమతిస్తాం'

4 Jun, 2020 17:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ : లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు సడలింపునివ్వడంతో భక్తులను దర్శనాలకు అనుమతించే అవకాశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆలయాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలను ఏపీ దేవాదాయశాఖ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు లేఖను పంపించింది. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.

వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ...  కేంద్రం ఆలయాలకు సడలింపులు ప్రకటించడంతో ఎపిలో భక్తులను అనుమతించే అంశంపై రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రితో  చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.  ఆలయాల్లో ధర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మాత్రమే భక్తులను దేవాలయాలకు అనుమతిస్తామని తెలిపారు.  వ్యక్తికి వ్యక్తి మధ్య భౌతిక దూరం, శానిటైజర్, మాస్క్ లు తప్పనిసరి చేశామన్నారు.  ఏపీలోని అన్ని దేవాలయాలలో ఒకటే మార్గదర్శకాలు ఉంటాయని, తిరుమలలో ఇప్పటికే వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు. టైం స్లాట్ ద్వారానే  గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని వెల్లడించారు. కరోనా తీవ్రత దృష్ట్యా దేవాలయాల్లో తీసుకున్న జాగ్రత్తలను లేఖ రూపంలో ఇప్పటికే హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు పంపామని, వారి నుంచి క్లియరెన్స్ రాగానే మరిన్ని గైడ్‌లైన్స్‌తో భక్తులను అనుమతిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు