ఆలయ భూములను పవిత్రంగా భావిస్తాం

3 Feb, 2020 06:10 IST|Sakshi

భీమిలిలో భూచోళ్లు అబద్ధం 

నిబంధనల ప్రకారమే భూముల లీజు మంత్రి వెలంపల్లి 

సాక్షి, అమరావతి: దేవదాయ భూములను పవిత్ర భూములుగా భావించే ప్రభుత్వం తమదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. భీమిలిలో భూచోళ్లు అంటూ ఈనాడు అసత్య కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భీమిలిలో దేవదాయ భూముల లీజుల వ్యవహారంలో అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. దేవదాయ భూముల లీజుకిచ్చే వ్యవహారంలో అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారన్నారు. కోట్ల విలువ చేసే 67 ఎకరాల భూముల్ని అక్రమంగా కట్టబెడుతున్నారనే ఆరోపణలు సరికావని తెలిపారు.

జనవరి 28నే భూముల లీజు వేలాన్ని రద్దు చేస్తూ పత్రికల్లో ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు. దేవదాయ భూములు గజం స్థలం విక్రయించాలన్నా హైకోర్టు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. అది తెలియకుండా ఇళ్ల స్థలాలకు దేవదాయ భూములు తీసుకుంటున్నారని దుష్పప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దుష్ప్రచారం చేసిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల్లో అన్యమత ప్రచారం ఎక్కడ జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మఠం భూములను ఇష్టారాజ్యంగా లీజుకు ఇచ్చేశారన్నారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అర్చక సంక్షేమ నిధులపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గతంలో టీడీపీ నేతలు పెన్షన్లను కూడా మింగేశారన్నారు.

మరిన్ని వార్తలు