అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కృషి

25 Oct, 2019 04:50 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి వెలంపల్లి. చిత్రంలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు

అర్చక (ఆగమ) పరీక్ష ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి వెలంపల్లి వ్యాఖ్య

ఆగమ పరీక్షలకు 5,176 మంది హాజరు..4,396 మంది ఉత్తీర్ణత

సాక్షి, అమరావతి: రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అర్చకుల (ఆగమ) కోర్సులకు నిర్వహించిన అర్చక పరీక్ష ఫలితాలను డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి గురువారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 2013 నుంచి అర్చకుల (ఆగమ) పరీక్షలను నిర్వహించలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకుల జీవితాల్లో వెలుగులు పేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు.

ఈ క్రమంలోనే 2019 జూలై 13, 14 తేదీల్లో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులకు ప్రవేశ, వర, ప్రవర ఆగమ పరీక్షలను నిర్వహించామన్నారు. పరీక్షల్లో తప్పిన వారికి సప్లిమెంటరీ నిర్వహిస్తామని, వెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అర్చకుల (ఆగమ) పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అర్చక (ఆగమ) పరీక్ష పాసైన వారు విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు కామేశ్‌ శర్మ పాల్గొన్నారు.

84.93 శాతం ఉత్తీర్ణత
ఆగమ పరీక్షలకు 5,176 మంది హాజరవ్వగా.. 4,396 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ శ్రేణిలో 2 వేల మంది, ద్వితీయ శ్రేణిలో 1,156 మంది, తృతీయ శ్రేణిలో 247, మౌఖిక మరియు ప్రయోగ పరీక్షల్లో 993 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 84.93. రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు నవంబరు 25లోగా కమిషనర్, దేవదాయ శాఖ కార్యాలయానికి రూ. 200 డీడీని జతపరిచి వివరాలు పంపాలి. ఫలితాల వివరాలను  https://tms.ap.gov.in వెబ్‌ సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు