సీఎం జగన్‌కు ధన్యవాదాలు : వెల్లంపల్లి

31 Oct, 2019 19:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి గుర్తుగా.. నవంబరు 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తన తరఫున, వైశ్య సమాజం తరఫున వెల్లంపల్లి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత అమరులయ్యారని గుర్తుచేశారు.

ఆ అమరజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఆయన ప్రాణత్యాగం తర్వాత 1953 అక్టోబరు 1న ఒక రాష్ట్రంగా ఏర్పడిందని.. కానీ, భాషాప్రయుక్త రాష్ట్రంగా(ఆంధ్రప్రదేశ్‌) మాత్రం 1956 నవంబరు 1న అవతరించిందని తెలిపారు. అందుకే నవంబరు 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రతి ఏడాది జరుపుతామని సీఎం వైఎస్‌ జగన్‌ గతంలో మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలను చరిత్రకు, మహనీయుల త్యాగాలకు నిదర్శనంగా జరుపుకోవాలని ఏపీ ప్రజలుకు మంత్రి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు