‘అత్యంత అవినీతిపరుడు కన్నా లక్ష్మీనారాయణ’

27 Apr, 2020 13:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..  2500 మంది అర్చకులకు రూ. 5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. మసీదుల్లోని మౌజమ్, చర్చి పాస్టర్లకు రూ. 5 వేలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని మతాలను సమానంగా చూస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ  సీఎం వైఎస్‌ జగన్‌‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గౌరవనీయులైన విజయమ్మ సూచన మేరకు అర్చకులను ఆదుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయన్నని కరోనా టెస్టులు చేస్తున్నామని ఆయన చెప్పారు.

పచ్చ, బీజేపీ నేతలు కరోనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్‌, కన్నా లక్ష్మీ నారాయణ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కన్నా సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కాదు పీఎం నరేంద్ర మోదీకి లేఖలు రాయాలన్నారు. లక్ష్మీనారాయణ టీడీపీ నేతగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీకి అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు కన్నా లక్ష్మీనారాయణ అని ఆయన అన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమా పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఇంట్లో ఉండి దీక్షలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి సహాయం చేయటంలేదని ఆయన మండిపడ్డారు.

అదేవిధంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల్లో ఏ లోటు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. లాక్డౌన్ వలన అర్చకులు, మౌజమ్, పాస్టర్‌లు ఇబ్బంది పడకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ రూ. ఐదు వేలు ఇస్తున్నారని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 16, 500 మందికి పెన్షన్‌లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. యనమల రామకృష్ణుడుకు బుద్ది, జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు బుద్ది, జ్ఞానం లేదు.. యనమలకు ఏమైందని విమర్శించారు.

కరోనా కేసులు దాస్తున్నామని టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కరోనా కేసులపై బెజవాడ సెంటర్‌లో టీడీపీ నేతలతో చర్చకు సిద్ధంగా ఉన్నాని ఆయన చెప్పారు. ధైర్యం ఉంటే మాతో చర్చకు చంద్రబాబు, యనమల, దేవినేని ఉమా రావాలని ఆయన సవాల్‌ విసిరారు. తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని.. తప్పుడు లెక్కలు చెప్పే చరిత్ర చంద్రబాబుదని మల్లాది విష్ణు మండిపడ్డారు. నిండు శాసనసభలో అబద్దాలు మాట్లాడిన చరిత్ర చంద్రబాబుదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపై గాలి విమర్శలు చేస్తున్నారని.. చంద్రబాబు, కన్నా, పవన్ కళ్యాణ్ పనికట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టింది చంద్రబాబే  అని మల్లాది విష్ణు విమర్శించారు.
 

మరిన్ని వార్తలు