‘అసంఘటిత కార్మికులకు మంచి పథకం’

30 Nov, 2019 14:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి మంచి చేయాలని భావిస్తాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆటోనగర్‌లోని ఆటో టెక్నిషియన్ అసోసియేషన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కార్మిక శాఖ అధ్వర్యంలో నిర్వహించిన పింఛను వారోత్సవాల్లో మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు. ఆయన ప్రధానమంత్రి శ్రమ్ యోగిమాన్ ధన్, వర్తకులకు నూతన పింఛను పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి పెన్షన్ పథకంలోని అర్హులైన, నమోదు చేసుకున్న లబ్దిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు ఇది మంచి పథకమని తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వారు ఇందుకు అర్హులని చెప్పారు. నెలకు రూ. 55 నుంచి రూ. 250 వరకు వయసును బట్టి చెల్లిస్తామని వివరించారు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3 వేలు పింఛను రూపంలో అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఇది కడితే కార్మికులకు భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి యువతను ప్రోత్సహించాలని 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశారని వెల్లంపల్లి శ్రీనివాసరావు గుర్తు చేశారు.

అసంఘటిత కార్మికులకు ఈ పింఛను పథకం ఓ వరమని కార్మికశాఖ కమిషనర్‌ రేఖారాణి పేర్కొన్నారు. చాలామంది ప్రభుత్వ పించనుపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రధానమంత్రి శ్రమ్ యోగిమాన్ ధన్ పింఛను పథకంలో కార్మికులు చేరటం అందరికీ మంచి సౌలభ్యమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కార్మికశాఖ కమిషనర్‌ రేఖారాణి, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు