రూ.37 లక్షలు మెక్కేశారు!

31 Aug, 2019 09:17 IST|Sakshi
నాలుగు పనులకు ఒకే ఫొటోపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఏపీడీ శ్రీనివాసప్రసాద్‌

ఉపాధి పనులపై సామాజిక తనిఖీలో  అవినీతి బట్టబయలు 

ఒక పేరుతో భూమి, మరొకరికి బిల్లులు

4 పనులకు ఒకే ఫొటోపై అవాక్కయిన ఏపీడీ

సాక్షి, బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలో ఉపాధి నిధులతో చేపట్టిన మొక్కల పెంపకం వ్యవహరంలో వెలుగు అధికారులు, సిబ్బంది రూ.36,72,910 స్వాహా చేశారని శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన సామాజిక బహిరంగ సభ బట్టబయలు చేసింది. ఈ అవినీతి, అక్రమాలపై డ్వామా ఏపీడీ, సభ నిర్వహకులు శ్రీనివాస ప్రసాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చొని ఉద్యో గం చేశారా అంటూ మండిపడ్డారు. సామాజిక తనిఖీ బృందం వెల్లడి చేసిన వివరాల మేరకు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.2.90 కోట్ల పనులు, ఉపాధి నిధులతో పీఆర్‌ ద్వారా రూ.1.05 కోట్లతో సిమెంటు రోడ్ల పనులు, సర్వశిక్ష అభియాన్‌ ద్వారా రూ.5.23 లక్షలతో పాఠశాలకు ప్రహరీగోడ నిర్మించారు.

సెర్ఫ్‌ ద్వారా పండ్లతోటల పెంపకం, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం పనుల కోసం రూ.1.44కోట్లు ఖర్చు చేశారు. అటవీ శాఖ ద్వారా మొక్కల పెంపకం కోసం రూ.49లక్షల ఖర్చు చేశారు. వాటర్‌షెడ్‌ పథకం ద్వారా ఫాంపాండ్లు, నీటి సంరక్షణ చర్యల కోసం రూ.57 లక్షలు ఖర్చు చేశారు. ఈ మొత్తం రూ.6.70కోట్ల నిధులు వినియోగంపై లెక్క తేల్చేందుకు సామాజిక తనిఖీ బృందం వారం పాటు పనులను పరిశీలించింది. ఇందులో అన్ని శాఖలకంటే సెర్ఫ్‌ (వెలుగు) ద్వారా చేపట్టిన మొక్కల పెంపకం అక్రమాలతో నిండిపోయినట్టు అధికారులు తేల్చారు. ఈ శాఖ మొక్కల పెంపకం కోసం రూ.1.44 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్క చూపగా అందులో రూ.33,32,820 నిధులు స్వాహా అయ్యాయని లెక్కించారు.

ఊహించని అక్రమాలు

ప్రధానంగా బీరంగి, బి.కొత్తకోట, గుమ్మసముద్రం, బయ్యప్పగారిపల్లెలో ఊహించని స్థాయిలో అక్రమాలు లెక్కించారు. భూమిలేకపోయినా మొక్కల పెంపకం జరిగిందని బిల్లులు ఇచ్చారు. ఒకే భూమిలో ఐదుగురు మొక్కలు పెంచారని ఐదు బిల్లులు చెల్లించారు. లేని మొక్కలు ఉన్నట్టు చూపించారు. ఇష్టానుసారంగా బిల్లులు ఇవ్వగా కొందరు రైతు బిల్లుల విషయమే తమకు తెలియదంటూ సభలో వాపోయారు.

  • బి.కొత్తకోటకు చెందిన వెంకటరమణ అర ఎకరంలో మొక్కలు పెంపకం చేపట్టితే 2 ఎకరాల్లో పెంచారని బిల్లులు చెల్లించుకున్నారు. అయితే అర ఎకరం పెంపకానికి బిల్లులు మాత్రమే ఇవ్వలేదు. 
  • కోటావూరు పంచాయతీలో రైతు శివన్న 210 మామిడి మొక్కలు పెంచుకుంటున్నాడు. తనిఖీల్లో 190 మొక్కలు బతికే ఉన్నాయని తేల్చారు. మొక్కలను బతికించుకునేందుకు శివన్న రోజూ సైకిల్‌పై నీటి బిందెలను తీసుకెళ్లి నీరు పోస్తున్నాడు. ఇతనికి 2019 మార్చి నుంచి నిర్వహణ బిల్లులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
  • రైతు ఎం.రెడ్డెప్పదీ ఇదే పరిస్థితి. తనిఖీల్లో ఒక ఎకరం పొలంలో 60 కొబ్బరి మొక్కలు పెంచగా రూ.9వేలు చెల్లించారు. తనిఖీల్లో 58 మొక్కలు బతికే ఉన్నాయని గుర్తించి బిల్లులు చెల్లించలేని తేలింది.
  • మొక్కల పెంపకం పేరుతో బీరంగి పంచాయతీలో రూ.10,24,663, బి.కొత్తకోట పంచాయతీలో 15,10,887, బయ్యప్పగారిపల్లె పంచాయతీలో రూ.2,29,263, గుమ్మసముద్రం పంచాయతీలో 9,18,727, గట్టు పంచాయతీలో రూ.1,11,852, కోటావూరు పంచాయతీలో రూ.75,795 అవినీతి జరిగిందని నిర్దారించారు. ఈ సొమ్మును రికవరీకి ఏపీడీ శ్రీనివాసప్రసాద్‌ ఆదేశాలిచ్చారు.

నాలుగు పనులకు ఒకే ఫొటో
బడికాయలపల్లె పంచాయతీలో మొక్కల పెంపకానికి సంబంధించి సంఘమిత్ర భారతి ఫొటోలను ఏపీడీకి చూపించారు. ఆయన వాటిని చూసి ఇక్కడైనా సవ్యంగా జరిగిందని అనుకుం టుండగానే ఫొటోలను పరిశీలించగా అన్ని పనులకు ఒకే ఫొటో పెట్టినట్టు గుర్తించి అవాక్కయ్యారు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు.

మిగతా శాఖల్లో..
ఉపాధి నిధులతో చేపట్టిన పనుల్లో ఇతర శాఖల్లోనూ అక్రమాలు వెలుగుచూశాయి. ఉపాధి హామీ పథకంలో రూ.60,249, పశుసంవర్దకశాఖలో రూ.32,963, పట్టు పరిశ్రమశాఖలో రూ.2,18,806, గృహ నిర్మాణశాఖలో 27,072, అటవీ శాఖలో రూ.1,000 అక్రమాలు జరిగి నట్టు తేల్చారు. వీటి రికవరీకి నోటీసులు జారీచేశారు. మండలంలో మొత్తం రూ.36,72,910 నిధులు దుర్వినియోగం అయినట్టు తేల్చారు.

గాలిలో మేడలు కట్టారు
వెలుగు సిబ్బంది గాలిలో మేడలు కట్టారని ఏపీడీ శ్రీనివాసప్రసాద్‌ ఈ అక్రమాలపై వ్యా ఖ్యానించారు. ‘‘అసలు వీరు పనులను చూడకనే బిల్లులు చేశారు. ఏపీఎం సహా సీసీలు, సంఘమిత్రలు నిధులను దుర్వినియోగం చేశా రు. వీరంతా విశ్రాంతి తీసుకోవాల్సిదే’’నంటూ సస్పెన్షన్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఏపీఎం సహా 22 మందిపై చర్యలు 
గత బి.కొత్తకోట వెలుగు ఏపీఎం ఈ.హరి నా«థ్, సీసీలు హనుమంతు, రామాంజులు, అరుణమ్మ, హంషీరాబేగం, చంద్రశేఖర్, బడికాయలపల్లె ఉపాధి క్షేత్ర సహాయకుడు శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. తొలగించిన సంఘమిత్రల్లో బి.కొత్తకోటకు చెందిన అంబికా, రమణమ్మ, షమీమ్, దీల్‌షాద్, గోళ్లపల్లెకు చెందిన సుజాత, గుమ్మసముద్రంకు చెందిన లీలావతి, బీరంగికి చెందిన బి.శంకరమ్మ, కవిత, కే.శంకరమ్మ, గట్టుకు చెందిన నరసమ్మ, శివమ్మ, బయ్యప్పగారిపల్లెకు చెందిన పద్మావతి, బడికాయలపల్లెకు చెందిన భారతి, నరసింహులు, కోటావూరుకు చెందిన పద్మజ ఉన్నారు.


 

>
మరిన్ని వార్తలు