ఆగని ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

10 Mar, 2015 19:41 IST|Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా : వేంపల్లె ట్రిపుల్ ఐటీలో అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారని, తాత్కాలికంగా సస్పెండ్‌ చేసి వారి అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం ఎదుట డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారని, కానీ  అందుకు భిన్నంగా అధికారులు అవినీతికి పాల్పడి తమకు సక్రమంగా అందాల్సిన సాంకేతిక విద్యను అందించకుండా ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం రెండు రోజులుగా వీరన్నగట్టుపల్లె వద్ద ధర్నా చేస్తున్నారు. సోమవారం ట్రిపుల్ ఐటీ అధికారుల చర్చలు సఫలం కాకపోవడంతో మంగళవారం కూడా ఆందోళన యథావిధిగా కొనసాగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం ఇక్కడికి చేరుకొని విద్యార్థుల  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విషయాలను ఆయన దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారని, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని వాపోయారు. ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటుచేసేవరకు క్యాంటీన్‌ నుంచి 50% కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. దీంతో అధిక రేట్లకు ఇక్కడ తమకు వస్తువులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఐడెంటిటీ కార్డులు, ఇతర అవసరాల కోసం ఒక్కొక్క విద్యార్థి వద్ద నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారని తెలిపారు.

ఇతర యూనివర్సిటీలకు రూ.50 కోట్ల నిధులు వస్తే,  తమ ట్రిపుల్ ఐటీలకు వందల కోట్లు నిధులు మంజూరవుతున్నా.. ఇక్కడ ఉన్న అధికారులు స్వాహా చేస్తున్నారని, విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రెండురోజుల నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, కె.ఎల్.ఎన్.రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఇక్కడికి వచ్చి సమస్య అడిగిన పాపాన పోలేదని వాపోయారు. ఈ సమస్యలు విన్న తర్వాత ఆర్డీవో వినాయకం విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించమని విజ్ఞప్తి చేశారు. అయితే వెంటనే అధికారులను సస్పెండ్ చేయాలని,  వారి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని... అంతవరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు తెగేసి చెప్పారు. వీసీ సత్యనారాయణ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని రోడ్డుపై  బైఠాయించారు.

విద్యార్థులతో మాట్లాడిన మంత్రి గంటా

కాగా విద్యార్థుల ధర్నా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మంగళవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి జోక్యం చేసుకొని మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని.. ఈనెల 15వ తేదీన తాను ట్రిపుల్ ఐటీకి వస్తున్నానని, నెలలోపు సీఎం చంద్రబాబు కూడా ట్రిపుల్ ఐటీకి రానున్నారని తెలిపారు. అయినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరిస్తే గానీ ఆందోళన విరమించేదిలేదని తేల్చి చెప్పారు. మళ్లీ రోడ్డుపై బైఠాయించారు.

మరిన్ని వార్తలు