సిక్కోలు యాసను కించపరచడం తగదు

5 Oct, 2018 07:27 IST|Sakshi
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సన్నశెట్టి రాజశేఖర్‌

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):   ఉద్యమాలకు నిలయమైన శ్రీకాకుళం భాష, యాసపై ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ వ్యగ్యంగా మాట్లాడం సరికాదని ఉత్తరాంధ్ర రచయితలు, కవుల వేదిక (ఉరకవే) ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్‌లో ఉరకవే నాయకుడు అట్టాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ‘పొట్టచింపితే హిందీ అక్షరం రాని ఉత్తరాంధ్ర’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడినప్పుడు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. సిక్కోలు నేలను హేళన చేసిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదన్నారు. రాధాకృష్ణకు ఉరకవే బహిరంగ లేఖ రాసేందుకు నిర్ణయించిందన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉత్తరాంధ్రను పాలకులు, పత్రికాధిపతులు.. కార్పొరేట్‌ శక్తుల కబంధ హస్తాల్లో కూరుకుపోయి హేళన చేయడం తగదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజా ఉద్యమం ద్వారా ఇటువంటివాటిని ఎండగడతామన్నారు.

తొలుత శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలిలో  ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయుకులు, కమ్యూనిస్టులు, పాత్రికేయులు, పలువురు మేధావులతో కలిసి నిరసన తెలియజేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన దువ్వాడ బాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రజాసంఘాల నాయకులు తాండ్ర ప్రకాష్, జయదేవ్, సనపల నర్శింహులు, వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, దివాకర్, టంక చలపతి, గురుగుబెల్లి బావాజీరావు, గొంటి గిరిధర్‌రావు, మిస్క కృష్ణయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు