ఇద్దరు సీఎంలు ఆ గడ్డ నుంచే..

24 Mar, 2019 09:24 IST|Sakshi
నాదెండ్ల భాస్వరరావు, కొణిజేటి రోశయ్య

సాక్షి, అమరావతి బ్యూరో: వేమూరు నియోజకవర్గం రాజకీయ ఉద్ధండులకు ఖిల్లా. పాడి పంటలకు ప్రసిద్ధి చెందిన డెల్టా ప్రాంతం. కృష్ణా తీరప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలు చైతన్యానికి మారుపేరు. మొదట 1952లో అమృతలూరు నియోజకవర్గంగా ఉండేది. 1955లో అది వేమూరు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2004 వరకు జనరల్‌గా ఉన్న ఈ స్థానం 2009 పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్‌ కేటగిరీ అయింది. ఈ నియోజకవర్గంలో జన్మించిన ఇద్దరు సీఎంలుగా పనిచేయటం విశేషం. వేమూరుకు చెందిన కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఏపీలో మంత్రిగా పలు కీలక శాఖలను నిర్వహించడంతో పాటు సీఎంగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. ఇక మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు స్వగ్రామం కొల్లూరు మండలం దోనేపూడి.

ఈయన 1983లో వేమూరు నుంచి ఎన్నికయ్యారు. 1984లో నెల రోజులపాటు సీఎం పదవి నిర్వహించారు. 1955, 1962లో శాసనసభకు ఎన్నికైన కల్లూరి చంద్రమౌళి వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామానికి చెందిన వారు. ఈయన మంత్రిగా పనిచేశారు. యడ్లపాటి వెంకటరావు ఈ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన ఈయన స్వగ్రామం అమర్తలూరు మండలం బోడపాడు. 1989లో శాసనసభకు ఎన్నికైన మాజీ మంత్రి అలపాటి ధర్మారావు ఈ నియోజకవర్గంలోని కొల్లూరు మండలం అన్నవరపులంక గ్రామానికి  చెందినవారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఈయన చుండూరు మండలం యడవల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం తెనాలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఈ నియోజకవర్గంలోని దోనేపూడికి చెందినవారు. పునర్విభజనలో ఈ స్థానం రిజర్వుడు కావడంతో ఈయన తెనాలి నియోజకవర్గానికి మారారు. ప్రస్తుతం వేమూరు స్థానం నుంచి నక్కా అనందబాబు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.  మంత్రిగా పనిచేశారు. టీడీపీ తరపున ప్రస్తుతం మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ మేరుగ నాగార్జున పోటీలో ఉన్నారు.   

మరిన్ని వార్తలు