సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత బాబాదే

23 Nov, 2017 03:05 IST|Sakshi

సత్యసాయి జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఘనంగా సత్యసాయి డీమ్డ్‌ వర్సిటీ 36వ స్నాతకోత్సవం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మన రొట్టె మనమే తినడం ప్రకృతి, పక్కవాని నుంచి దొంగిలించి తినడం వికృతి, మన రొట్టెను పక్కనున్న వానికి పెట్టడం సంస్కృతి. ఇది భారతీయ సంస్కృతిలోని గొప్పదనం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత సత్యసాయి బాబాది’ అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. బాబా సమాధికి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, భక్తులనుద్దేశించి ప్రసంగించారు.

తాను మొదట అద్వానీతో కలిసి పుట్టపర్తికి వచ్చానని, అద్వానీ నన్ను పరిచయం చేయబోతే బాబా.. ‘వెంకయ్యనాయుడు నాకు తెలుసు. ఆరోగ్యం ఎలా ఉంది?’ అని అడిగారని గుర్తు చేశారు. నిజానికి నాకు ఆరోగ్యం బాగాలేని సంగతి బాబాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయానన్నారు. ‘గాడ్‌బ్లెస్‌ యూ’ అని దీవించారన్నారు. భారతీయ పురాణాలు, సంస్కృతి, చరిత్ర ‘మానవ సేవే మాధవ సేవ’ అని చెబుతుందని, దాన్ని బాబా ఆచరించి ప్రపంచాన్ని మొత్తం చైతన్యం చేశారన్నారు.

ఈ రోజు బాబా చూపిన మార్గంలో సత్యసాయి ట్రస్టు పయనిస్తోందన్నారు. మంచినీరు, విద్య, వైద్యసేవల్లో ట్రస్టు సేవలు ఎనలేనివని కొనియాడారు. బాబాను పూజించడమంటే చిత్రపటాలకు పూలమాల వేయడం, నమస్కరించడం కాదని.. బాబా చూపిన సేవామార్గంలో నడిచినప్పుడే ఆయన్ను పూజించినట్లని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమ, సేవ రెండూ ఉంటే శాంతి ఉంటుందన్నారు. ‘సర్వధర్మ సమభావన’ అనేది పుట్టపర్తిలో ఉందని, ఇది విశ్వవ్యాప్తంగా కావాలని కాంక్షించారు. కొంతమంది రాజకీయ నేతలు సెక్యులరిజమ్‌ అని గొప్పగా చెబుతుంటారని, భారతదేశంలోని ప్రతి ఒక్కరి డీఎన్‌ఏలో సెక్యులరిజమ్‌ ఉంటుందన్నారు.

భావితరాలకు సత్యసాయి బోధనలు..
సత్యసాయి అవతార విశేషాలు, బోధనలు, సందేశాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సత్యసాయి ఆర్కీవ్స్‌ భవనాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు