తెలుగు భాషా వేడుకలకు హాజరైన వెంకయ్య నాయుడు

29 Aug, 2019 10:50 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులోనే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. గురువారం విశాఖలో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరిచిపోకూడదు అని సూచించారు. మాతృభాషను కాపాడుకోడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. అందుకు ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడం తప్పనిసరి చేయాలన్నారు. ఇందుకోసం నిబంధనలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఏపీలోని ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

చిన్న చిన్న దుకాణాల నుంచి సంస్థల పేర్ల వరకు కూడా తెలుగులో ఉండేలా చర్యలు తీసుకుంటే తెలుగు భాష మనుగడలో ఉంటుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రతీ దేశం తమ సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభాషలను కాపాడుకోకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని, మాతృభాషకు మళ్లీ మంచి రోజులు రావాలని ఆయన ఆకాంక్షించారు. తాను చైర్మన్‌ హోదాలో ఉన్నపుడు రాజ్యసభలో ఎంపీలు మాతృభాషలో మాట్లాడుకునేలా నిబంధనలు మార్చానని గుర్తు చేశారు. సమీర్‌ దినదానిభివృద్ధి చెందుతుండటం అభినందనీయం అని ప్రశంసించారు. సమీర్‌ పరిశోధనలు దేశానికి దిక్సూచిగా మారాలి అని ఆకాంక్షించారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో జరుగుతున్న పరిశోధనలకు సమీర్‌ ప్రధాన కేంద్రంగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు