చట్ట సభల్లో వాడుతున్న భాష సిగ్గు చేటు

9 Feb, 2020 04:30 IST|Sakshi
ఉపరాష్ట్రపతికి ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి నౌక సామర్థ్యాన్ని వివరిస్తున్న ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఏకే జైన్‌

రాజకీయ నాయకులు ప్రత్యర్థులే కానీ.. శత్రువులు కారు 

ఇంగ్లిష్‌ అవసరమే కానీ.. మాతృభాష ముఖ్యం 

సీఏఏపై ప్రజలు అధ్యయనం చేయాలి: వెంకయ్య నాయుడు

సాక్షి, విశాఖపట్నం: చట్టసభల్లో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అసహనాన్ని కలిగిస్తోందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో నాయకులు వాడుతున్న భాష సిగ్గు చేటుగా ఉందని శుక్రవారం పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్‌ కోనేరు రామకృష్ణ జీవితం ఆధారంగా రచించిన ‘ఏ ఛైల్డ్‌ ఆఫ్‌ డెస్టినీ ఆన్‌ ఆటో బయోగ్రఫీ’ పుస్తకాన్ని విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. వెంకయ్య మాట్లాడుతూ.. అమ్మ, అక్క అనే పదాలు పవిత్రమైనవని, కానీ.. అసెంబ్లీలలో నాయకులు వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని, చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలనీ.. చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు.

ఇంగ్లిష్‌ ముఖ్యమే అయినా.. 
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్‌ చదువులు ముఖ్యమే అయినా.. మాతృ భాషను విస్మరించొద్దని ఉప రాష్ట్రపతి సూచించారు. తనకు కాన్వెంట్‌ అంటే ఏంటో తెలీదన్నారు. మాతృభాష కళ్లు అయితే.. ఇంగ్లిష్‌ కళ్లజోడు లాంటిదన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని, విద్యతో పాటు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, వినయం, సంస్కారాన్ని బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఏఏ సహా అన్ని చట్టాలపై దేశవ్యాప్తంగా ప్రజలు అధ్యయనం చేయాలన్నారు. దేశ చట్టసభలు తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడే హక్కు పొరుగు దేశాలకు లేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. 

ఐఎన్‌ఎస్‌ డేగాలో గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ 
మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం విశాఖకు వచ్చిన వెంకయ్యకు ఐఎన్‌ఎస్‌ డేగాలో తూర్పు నౌకాదళం గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో స్వాగతం పలికింది. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్, కలెక్టర్‌ వినయ్‌చంద్, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా గౌరవ స్వాగతం పలికారు. అనంతరం వెంకయ్య తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాన్ని  సందర్శించారు. ప్రత్యేక బోటులో హార్బర్‌లో పర్యటించి, దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి యుద్ధనౌకను సందర్శించారు.  

మరిన్ని వార్తలు