టీ-బిల్లును అధ్యయనం చేశాకే...మద్దతుపై నిర్ణయం

10 Feb, 2014 01:42 IST|Sakshi
టీ-బిల్లును అధ్యయనం చేశాకే...మద్దతుపై నిర్ణయం

 వెంకయ్య నాయుడు స్పష్టీకరణ
 తెలంగాణకు కట్టుబడి ఉన్నాం.. సీమాంధ్రకూ న్యాయం జరగాలి
 రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ హడావుడిగా ఈ బిల్లును తెస్తోంది
 మా నిర్ణయాత్మక సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు
 ఆయా అంశాలపై బిల్లులో స్పష్టత ఉంటేనే దీనిపై స్పందిస్తాం

 
 సాక్షి, నెల్లూరు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని.. అయితే సీమాంధ్ర ప్రజల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరముందని బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. తెలంగాణ బిల్లును తాము సవివరంగా అధ్యయనం చేసిన తర్వాతే.. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. బిల్లు అధికారికంగా ఇంకా బయటకు రాలేదని.. రెండు, మూడు రోజుల్లో బిల్లుపై ఒక స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘ఇరు ప్రాంతాల అభివృద్ధికి మేం కొన్ని నిర్ణయాత్మక సూచనలు అందించాం.. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించటం లేదు’’ అని ఆయన చెప్పారు. వెంకయ్య ఆదివారం నెల్లూరులోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 
 వారు అలా చేస్తూ.. మమ్మల్ని అడిగితే ఎలా?
 
 ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన బిల్లును సరైన కసరత్తు చేయకుండా ఆగమేఘాల మీద ప్రవేశపెట్టటం విచారకరం. ఒకవైపు కాంగ్రెస్‌లో సీఎం, మంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు మాట్లాడుతుంటే.. బీజేపీ అభిప్రాయాన్ని చెప్పాలనటం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని తెలుపుతోంది. అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారని మమ్మల్ని అడిగితే ఎలా? కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను పాటించక పోతే మేమేం చేయాలి?
 
 నిర్మాణాత్మక సూచనలు పట్టించుకోలేదు...
 
 ఆచరణకు సాధ్యం కాని మాటలతో కాంగ్రెస్ ఇరు ప్రాంత ప్రజలకు రిక్త హస్తం చూపింది. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధిని సీమాంధ్రలో కూడా చేసేందుకు మేం పలు ప్రతిపాదనలు చేశాం. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయటం, రాయలసీమను ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించటం, సంస్థల స్థాపనకు మొదటి పదేళ్లు వంద శాతం, ఆ తర్వాత ఐదేళ్లు కేంద్ర పన్నులో 50 శాతం మినహాయింపు కల్పించటం వంటి సూచనలు చేశాం. తెలంగాణపై ఏర్పాటైన జీవోఎం సభ్యుడు, కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో భేటీలో, తెలంగాణ బిల్లుకు మద్దతు కోరుతూ నన్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్‌సింగ్, అహ్మద్ పటేల్‌లకు ఈ సూచనలు అందజేశాను.
 
 ఈ అంశాలపై బిల్లులో స్పష్టత ఉంటేనే...
 
 కృష్ణా జిల్లాలో మిసైల్ టెస్ట్ రేంజ్ కేంద్రం, డీఆర్‌డీఓ, డీఎల్‌ఆర్‌ఎల్ లాంటి సంస్థల ఏర్పాటు, బ్రహ్మిణి స్టీల్స్ స్థానంలో సమీకృత ఉక్కుకర్మాగారం ఏర్పాటు, సీమాంధ్ర ప్రాంతాల్లో ఐఐటీలు, బిజెనెస్ స్కూల్స్, విశాఖ నుంచి చెన్నై వరకు అభివృద్ధి కారిడార్ ఏర్పాటు, విశాఖపట్నం, రామాయపట్నం పోర్టులు, రైల్వేజోన్‌లు తదితర అంశాల పై బిల్లులో స్పష్టత ఉంటేనే మా పార్టీ విభజనపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది. నిర్మాణాత్మకమైన సలహాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ కేవలం రాజకీయ లబ్ధికోసం రాష్ట్ర విభజన చేయాలంటే సులభమైన పని కాదు. కొత్త రాజధాని నిధుల కేటాయింపుపై సీమాంధ్ర ప్రజల మనోభావాలకు నమ్మకం కలిగించే విధంగా బిల్లు ఉంటే మా పార్టీ అధిష్టానం అభిప్రాయాల మేరకు బిల్లుపై స్పందిస్తాం.
 
 ఆర్థిక కేటాయింపుల ఊసేదీ..?
 
 సీమాంధ్ర ప్రాంత ప్రతిపాదనలకు ఆర్థిక కేటాయింపుల విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడలేదు. సీమాంధ్రలో అన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఒక్కసారిగా కేటాయింపులు చేయటం సాధ్యంకాదు. అలాగే.. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు తెలంగాణ బడ్జెట్ల మధ్య తేడాను సరిచేసే విధానాలు, ఏర్పాట్లను కూడా బిల్లులో కేంద్రం పొందుపరచాలి. ప్రస్తుతం కోస్తా ఆంధ్రకు రూ. 684 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే.. రాయలసీమకు రూ. 7,600 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణకు రూ. 8,400 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే.. హైదరాబాద్‌కు రూ. 12,854 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. 14వ ఆర్థిక సంఘం ఆమోదం ఉంటేనే రాష్ట్ర విభజన జరుగుతుంది. స్వయం ప్రతిపత్తి గల ఆర్థిక సంఘం.. రాజకీయ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోదు. ఈ అంశంలో కాంగ్రెస్‌ను తప్పుపట్టక తప్పదు.
 
 ఆ పేరెత్తే హక్కు రాహుల్‌కు లేదు...
 
 బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై రాహుల్ విమర్శలు అవగాహనా రాహిత్యం. విభజించి పాలించటం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటే. ఆర్‌ఎస్‌ఎస్ పేరెత్తే హక్కే రాహుల్‌గాంధీకి లేదు. గుజరాత్‌లో అభివృద్ధి లేదని రాహుల్ మాట్లాడటం అహంకారపూరితం, హాస్యాస్పదం. గుజరాత్‌లో 10.6 శాతం అభివృద్ధి ఉంటే  కేంద్రంలో కేవలం 4.6 శాతం అభివృద్ధి ఉంది. మోడీ ప్రభంజనానికి భయపడి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని మేం ఖండిస్తున్నాం.’’
 
 యెన్నం కాంగ్రెస్ ఏజెంట్...
 
 వెంటనే సస్పెండ్ చేయాలి: హరిబాబు, విష్ణువర్ధ్దన్‌రెడ్డి

 
 సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో ఉన్న కాంగ్రెస్ ఏజెంట్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు హరిబాబు, బీజేవైఎం కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుపై ఆయన చేసిన విమర్శలను వారు ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాల్లోనైనా లేరని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి తొలగిస్తే బీజేపీలో చేరిన ఆయన ఇక్కడ పార్టీలో చిచ్చుపెట్టడానికి ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ గల పార్టీలో ఇలాంటి వ్యక్తులకు స్థానం లేదని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, అదే సమయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారించాలని కోరడంలో తప్పేముందని వారు ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు