‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి’

25 Dec, 2019 08:25 IST|Sakshi

ఏపీ నిట్‌ ప్రథమ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అప్పుడే నగరాలకు వలస వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. ఇటు గ్రామాలు, అటు పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. నేను రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. కేవలం అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాను’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి నగరాలకు వలసలు ఎక్కువై మురికివాడలను తలపిస్తున్నాయి అన్నారు. నగరాల అభివృద్ధిలో భాగంగా మురికివాడల్లోని ప్రజలకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని కోరారు. రాజకీయ వ్యవస్థలో అన్నీ ఉచితంగా ఇస్తామనడం పరిపాటిగా మారిందని, ఇలాంటి పథకాలతో జనాలకు మేలు జరగదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం యువత కొత్త ఆవిష్కరణలు చేయాలని, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు.

నదులకు కూడా మహిళల పేర్లు పెట్టి పూజించే మన దేశంలో నేడు అత్యాచారాలు, హింస వంటివి చోటుచేసుకోవడం శోచనీయమన్నారు. వీటిని అరికట్టేందుకు చట్టాలు తెచ్చినా జనాల మనస్తత్వం మారదన్నారు. ప్రజా జీవనంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో భారత్‌ ప్రపంచంలో మూడవ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలవనుందని ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ఇంజనీరింగ్‌ పట్టాలు పొందిన యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త పరిశోధనలకు, ఆవిష్కరణలకు యువత కృషి చేయాలన్నారు.

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ ఏపీ నిట్‌లో ఇది మర్చిపోలేని రోజన్నారు. చదువును పూర్తిచేసుకుని బయటకు వెళుతున్న విధ్యార్థులు రాష్ట్ర గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటేలా కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఏపీ నిట్‌ డైరెక్టర్‌ సీఎస్‌పీ రావు, రిజిస్ట్రార్‌ జి.అంబాప్రసాద్‌ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, 
గవర్నర్‌ హరిచందన్‌ 

మరిన్ని వార్తలు