‘ప్రత్యర్థులే.. శత్రువులు కాదు’

25 Aug, 2018 06:46 IST|Sakshi
మిత్రులతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సభ్యులు గుర్తిస్తే అర్థవంతమైన వేదికగా పార్లమెంట్‌

మిత్రుల ప్రోత్సాహమే నా అభ్యున్నతికి మూలం

‘ఉపరాష్ట్రపతితో ఉపాహారం’ లో వెంకయ్యనాయుడు

ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పార్లమెంట్‌ సభ్యులు సభలో ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ విషయాన్ని గౌరవ సభ్యులంతా గమనించి అర్థవంతమైన చర్చకు వేదికలుగా లోక్‌సభ, రాజ్యసభలను నిలపాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం రుషికొండలోని ఒక కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘ఉపరాష్ట్రపతితో ఉపాహా రం’ పేరుతో నిర్వహించిన మిత్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీలు, వ్యక్తిగత ప్ర యోజనాలు ఎజెండాగా జరుగుతున్న రాద్ధాంతాల కారణంగా విలువైన సమయం వృథాగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈ దశలో రాజ్యసభను సమర్థవంతంగా నిర్వహిం చేందు కు ప్రయత్నిస్తున్నానన్నారు. కేంద్ర, రాష్ట్రాలమధ్య సంబంధాలు పార్టీలకతీతంగా ఉండాలని, ఆ దిశగా ప్ర భుత్వాలు, పార్టీలు పరస్పర సహకారాన్ని అందించుకోవాలన్నారు.

ప్రొటోకాల్‌తో ప్రజలకు చేరువ కాలేకపోతున్నా
తొలినుంచి ప్రజలతో దగ్గరగా మెలిగే మనస్తత్వమున్న తాను ప్రొటోకాల్‌ కారణంగా ప్రస్తుతం జనానికి చేరువ కాలేకపోవడం కొంత బాధను కలిగిస్తోందన్నారు. అయినా తన పరిధిలో సేవ చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నానని చెప్పారు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో పర్యటించి విద్యార్థులతో మమేకమై దేశ భవిష్యత్‌పై మార్గనిర్దేశం చేస్తున్నానన్నారు. దేశంలోని రీసెర్చ్‌ సెంటర్లను సందర్శించి సాంకేతికత ఆవశ్యకత, ఆవిష్కరణలు వంటి అంశాలపై యువశాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. వ్యవసాయం లాభసాటి కాదని రైతులు అభిప్రాయపడుతున్నందున అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల సహకారంతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. ప్రాచీన విద్యావిధాన విశిష్టతను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసే నిర్ణయాలు బలంగా జరగాలన్నారు. మన దేశ జనాభాలో 65 శాతం యువతే ఉన్నందున వారి ఆలోచనలు, ఆవిష్కరణలతో అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా ప్రభుత్వాలు దారులు వేయాలన్నారు.  కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

విశాఖతో ప్రత్యేక అనుబంధం
 విశాఖ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన అభ్యున్నతి అంతా మిత్రుల, శ్రేయోభిలాషుల ప్రోత్సాహమేనన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు 4 ఏళ్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు