జిల్లావాసికి అరుదైన గౌరవం

1 Dec, 2019 09:15 IST|Sakshi
ఏసీఏ అపెక్స్‌ సభ్యులతో ఎం. వెంకటశివారెడ్డి

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈఓగా వెంకటశివారెడ్డి

మూడు దశాబ్దాల అనుభవానికి పెద్దపీట

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

సుదీర్ఘ పాలన అనుభవానికి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) పెద్దపీట వేసింది. మన జిల్లాకు చెందిన ముండ్ల వెంకటశివారెడ్డికి ఏసీఏలో కీలకమైన సీఈఓ పోస్టును కట్టబెట్టి గౌరవించింది. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా ఉన్న ఈయనకు సీఈఓ పదవి రావడంతో జిల్లా క్రికెట్‌ సంఘానికి మహర్దశ పట్టనుంది.. రానున్న రోజుల్లో కీలకమైన మ్యాచ్‌లను తీసుకురావడంతోపాటు జిల్లాలో క్రికెట్‌ మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా క్రికెట్‌ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, కడప :  చెన్నూరు మండలం ముండ్లపల్లె గ్రామానికి చెందిన ఎం. వెంకటశివారెడ్డి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా నియమితులయ్యారు.  ఏసీఏ నుంచి ఉత్తర్వులు అందాయి. స్వతహాగా క్రికెటర్‌ అయిన వెంకటశివారెడ్డి బ్యాట్స్‌మన్‌గా, ఆఫ్‌ స్పిన్నర్‌గా రాణించారు. ఎస్వీయూ, ఎస్‌కేయూ క్రికెట్‌ జట్లకు ఈయన ప్రాతినిధ్యం వహించడమే కాక ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీసిన రికార్డు కూడా ఈయన సొంతం. ఈయన తండ్రి ఎం. చంద్రశేఖరరెడ్డి జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌గా, క్రికెట్‌ సంఘం అధ్యక్షుడుగా ఉన్నా రు. ఆయన స్ఫూర్తితో ఈయన తొలుత (1990) క్రికెట్‌ సంఘంలోకి ప్రవేశించడంతో పాటు అధ్యక్షస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 29 సంవత్సరాల పాటు ఏకధాటిగా జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. దీంతో పాటు 2011 నుంచి 2019 వరకు ఏసీఏ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. దీంతో పాటు 2006లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభధ్రుల ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రజాశీర్వాదం పొందారు. కేడీసీఏ, ఏసీఏ సంఘాల పదవులతో పాటు బీసీసీఐ యాంటీ డోపింగ్‌ కమిటీ సభ్యుడుగా, ఇండియా ఏ టీం మేనేజర్‌గా పనిచేశారు. న్యూజిలాండ్‌ ఏ జట్టు లైజన్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

కడపలో క్రికెట్‌ మైదానం ఏర్పాటులో..
2004లో  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జిల్లాలో మంచి క్రికెట్‌ మైదానం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన్ను కలిసి నిర్మాణానికి శ్రీకాకారం చుట్టారు. దీంతో  వైఎస్‌  11 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు రూ.50 లక్షలు అందజేశారు. 2011 నాటికి 15వేల మంది ప్రేక్షకులు వీక్షించగలిగే మైదానం అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఈయన కీలకపాత్ర పోషించారు. అప్పటి ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు సహకారంతో పలు రంజీ, రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లను కడపకు తీసుకువచ్చారు. 2013లో దేశంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్‌ క్రికెట్‌ అకాడమీనీ కడపలో ఏర్పాటు చేయడంలో వెంకటశివారెడ్డి కీలకపాత్ర పోషించారు.  2014లో కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం మైదానాలను, డ్రస్సింగ్‌ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

కడప గడపకు దిగ్గజ క్రికెటర్లు..
1993లో అప్పటి జిల్లా కలెక్టర్‌ కె.వి. రమణాచారి సూచనల మేరకు అప్పటి కేడీసీఏ అధ్యక్షుడుగా ఉన్న ఎం. వెంకటశివారెడ్డి కడప నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో ఛారిటీ మ్యాచ్‌ నిర్వహించారు. 1993 జూన్‌ 12వ తేదీ నిర్వహించిన ఈ చారిటీ మ్యాచ్‌కు క్రికెట్‌ లెజండ్స్‌ సచిన్‌టెండూల్కర్, అనిల్‌కుంబ్లే, జవగళ్‌ శ్రీనాథ్, రవిశాస్త్రి, వెంగ్‌సర్కార్, మనోజ్‌ప్రభాకర్, వెంకటపతిరాజు, కిరణమోరే, వెంకటేష్‌ప్రసాద్, సయ్యద్‌ కిర్మాణీ, సలీల్‌ అంకోలా వంటి దిగ్గజ క్రికెటర్లు కడప గడపకు విచ్చేసి మ్యాచ్‌ ఆడారు. అలా లెజండరీ క్రికెటర్లను చూసే అవకాశం జిల్లా వాసులకి దక్కింది. కాగా జిల్లాకు చెందిన వ్యక్తికి ఏసీఏ సీఈఓగా అవకాశం రావడం పట్ల జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో క్రికెట్‌కు, క్రీడాకారులకు మరింత మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు